కాశీబుగ్గ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన

Deputy CM Pawan Kalyan Expresses Profound Grief Over Kasibugga Temple Stampede

శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 9 మంది మరణించారు. అలాగే, అనేకమంది గాయపడ్డారు.

ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో జరిగిన విషాద ఘటనపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, దేవాదాయ శాఖ అధికారులకు మరియు జిల్లా యంత్రాంగానికి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి లోకేశ్ కాశీబుగ్గ పయనం

మరోవైపు కాశీబుగ్గ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరగడం అత్యంత దిగ్భ్రాంతికరమని పేర్కొన్న ఆయన మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇక ప్రమాద తీవ్రతను తెలుసుకునేందుకు మరియు క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆయన హుటాహుటిన కాశీబుగ్గకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకొని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు చేరుకోనున్న లోకేశ్ తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here