
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. వివిధ శాఖల పరంగా అధికారులతో వరుసగా సమీక్షలు చేస్తూ.. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇక.. సోమవారం అంటే జూన్ 1న తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్..తన శాఖ పంచాయితీ రాజ్ ఆర్దిక పరిస్థితి బాగోకపోవడం వల్ల తాను జీతం తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
మరోవైపు అసెంబ్లీలో జనసేన పార్టీ నుంచి విప్‌ల నియామకం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాసారు. అసెంబ్లీలో జనసేనకు 21 ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్న విషయం తెలిసిందే. వీరిలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దర్గేష్ మంత్రులుగా ఉన్నారు.
అసెంబ్లీ స్పీకర్ పదవి తెలుగు దేశం పార్టీకి దక్కడంతో.. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని తమ మిత్రపక్షాలకు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా జనసేనకు ఇస్తే ఎవరికి ఇస్తారంటూ ఓ ఇద్దరి నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అదే సమయంలో కూటమి నేతలకు కాదని..టీడీపీ నుంచే డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే దీని పైన తుది నిర్ణయం తర్వాతే డిప్యూటీ స్పీకర్ ఎవరనేది తెలియనుంది.
ఇటు, అసెంబ్లీలో చీఫ్ విప్‌గా తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఖరారు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ఇక..విప్‌లుగా కూటమిలోని మూడు పార్టీల నేతలకు అవకాశం దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై తాజాగా జనసేన పార్టీ నుంచి ఇద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసారు. జనసేన నుంచి విప్‌లుగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేరు, రైల్వే కోడూరు నుంచి గెలిచిన శ్రీధర్ పేరును సిఫార్సు చేసారు. ఈ ఇద్దరినీ అసెంబ్లీలో తమ పార్టీ విప్ లుగా ఖరారు చేసినట్లు పవన్ వెల్లడించారు. దీనిపై అధికారికంగా ఆదేశాలు వెలువడటమే మిగిలింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY