
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. భూ కబ్జాల బాధితుల సమస్యలను స్వయంగా పరిశీలించి.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని నిర్ధారిస్తూ, అక్రమాలకు పాల్పడే వారిని, వారు కూటమి నేతలైనా సరే ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో తమ్ముడు తనవాడయినా ధర్మం తప్పకూడదన్న రూల్‌ను కూటమి ప్రభుత్వం పాటిస్తుందనే విషయాన్ని మరోసారి చెప్పకనే చెప్పారు. ఇటీవల కిరణ్ చేబ్రోలు విషయంలో ఇది ప్రూవ్ చేసుకున్న కూటమి ప్రభుత్వం ..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో అందరికీ మరోసారి క్రిస్టల్ క్లియర్ గా చెప్పినట్లు అయింది.
పవన్ కళ్యాణ్ తాజాగా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో.. భూ కబ్జాల బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని స్వయంగా తానే పరిశీలిస్తానని ప్రకటించారు. దీనిలో భాగంగా ఏపీ వ్యాప్తంగా జిల్లాలను సందర్శించి ఫిర్యాదులను స్వీకరించడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భూ కబ్జాలకు సంబంధించిన అక్రమాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి కసరత్తులు చేస్తున్నట్లు పవన్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తోందని మరోసారి పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. అయితే, ప్రజలను ఇబ్బంది పెట్టే వారు ఎవరైనా సరే..చివరకు వారు కూటమి నాయకులైనా సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అలాగే, ప్రజల కష్టాలను తీర్చడానికి తన సేవా కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి పెరిగిపోతున్న భూ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజలకు న్యాయం అందించాలనే పవన్ సంకల్పాన్ని సూచిస్తుందన్న వాదన వినిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో చేసిన భూ కబ్జాలు, వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. ఈ సమస్యలు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తున్నాయి. దీంతో డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం బాధితులకు న్యాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో అర్జీల స్వీకరణకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతుండటం, ప్రజలకు నేరుగా సేవ చేయాలనే ఆయన నిబద్ధతను చాటుతోందని అంతా అనుకుంటున్నారు.