ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక.. రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది . రాజధాని పనులను వేగవంతం చేస్తూ వస్తున్న సీఆర్డీఏ తాజాగా టెండర్లను పిలిచింది. సింపుల్‌గా చెప్పాలంటే అమరావతిలో ఇన్నాళ్లూ నిలిచిపోయిన పనులను స్పీడప్ చేసింది కూటమి సర్కార్.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పనులను వేగంగా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.దీని గురించి రాజధాని అమరావతిలో 2వేల 816 కోట్లతో తలపెట్టే అభివృద్ధి పనులకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది . రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోతున్న పలు అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించింది.
బిడ్ల దాఖలుకు జనవరి 31న సాయంత్రం 4 గంటల వరకు సీఆర్డీఏ గడువు ఇచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాలవాగు, గ్రావిటీ కాలువల పనులతో పాటుగా రాజధాని అమరావతిలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించిన పనులకు కూడా టెండర్లను పిలిచింది.
ఈ పనుల్లో అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ కొండవీటి వాగును, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకూ పాలవాగును వెడల్పు చేయడంతో పాటు లోతు చేసే పని కూడా ఉంది. ఈ పని కోసం శాఖమూరులో 462.26 కోట్ల రూపాయలతో 0.03 టీఎంసీ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు.
303.73 కోట్ల రూపాయలతో 7.83 కిలోమీటర్ల పొడవు కాలువ నిర్మాణం చేపడుతూ.. 0.1 టీఎంసీ సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వాయర్ పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు 372.23 కోట్లతో ఈ8 రోడ్డు, 419.96 కోట్ల రూపాయలతో ఈ9, 241.67 కోట్లతో ఈ14, 364.41 కోట్ల రూపాయలతో ఈ3 రోడ్లు నిర్మించనున్నారు. అంతేకాదు 443.84 కోట్ల రూపాయలతో ఎన్12, 183.21 కోట్లతో ఎన్6 ఇలా వివిధ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నారు.
అంతేకాకుండా రెయిన్ వాటర్ డైవర్షన్ కాలువలు, తాగునీటి సరఫరా పైపులైన్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, సైకిల్ ట్రాక్‌లు, విద్యుత్, కమ్యూనికేషన్ డక్ట్ నిర్మాణం కోసం కూడా తాజాగా సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది.దీంతో ఇన్నాళ్లూ రాజధాని అభివృద్ధిపై పేరుకుపోయిన అమరావతివాసుల అనుమానాలన్నీ పటాపంచలవుతున్నట్లు అయింది.