ఏపీలో కాక రేపుతున్న పవన్ కామెంట్స్…

ఏపీలో మహిళలపై వరుస అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవిని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, తాను హోంమంత్రి అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నిజాయతీగా ఉండాలన్న విషయాన్ని గట్టిగా చెప్పిన ఆయన, పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

క్రిమినల్‌కు కులం, మతం ఉండదు. రేప్ చేసిన వాళ్లను అరెస్ట్ చేయడానికి కులం అడ్డొస్తుందా? అధికారులు ఏం చేస్తున్నారు.. క్రిమినల్స్‌ను వదిలేయమని చట్టం చెప్తోందా అని ప్రశ్నించారు. పోలీసులు, కలెక్టర్లు పదే పదే చెప్పించుకోవద్దని పవన్ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కీలకమైనది. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. మేము ఎవరినీ వెనకేసుకు రావడం లేదు.. మీరు కూడా వెనకేసుకు రావద్దన్నారు పవన్. ముఖ్యంగా, హోంమంత్రి అనిత శాంతిభద్రతల విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. లైంగికదాడికి తెగబడే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో హాట్‌టాపిక్‌గా మారాయి. అటు వైసీపీ సైతం దీనిపై విమర్శలు మొదలెట్టింది. దీంతో పవన్ వాఖ్యలతో కూటమిలో చీలిక రావడం ఖాయం అనేంతలా వైసీపీ ఎద్దేవా చేస్తోంది. అయిత పవన్ వాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు. పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు నారాయణ. మంత్రిత్వశాఖలలో ఏ శాఖ పనితీరు అయినా సరిగా లేకుండా ఉంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలర్ట్ చేస్తారని నారాయణ చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా అలాంటివేనని అభిప్రాయపడ్డారు. ఘటనల నేపథ్యంలో సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారని నారాయణ అన్నారు.