వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఏపీ పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేయనున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లును పోలీసులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆయన అరెస్టు తప్పదని… ఏ క్షణంలోనైనా దువ్వాడకు సంకెళ్లు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ పై ఉభయగోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జనసేన నేతలు కేసులు పెట్టారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి జనసేన అధినేత, ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆయన చాలాసార్లు నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. దీంతో అప్పట్లోనే జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే.. వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాగా ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవగా.. ఈ సందర్భంలో కూడా దువ్వాడ శ్రీనివాస్..డిప్యూటీ సఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో మరోసారి జనసేన నేతలు ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై కేసులు నమోదయ్యాయి. అరెస్టుకు సిద్ధంగా ఉండాలని దువ్వాడ శ్రీనివాస్ కు జనసైనికులు సవాల్ చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదు చేసిన పోలీసులు.. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దువ్వాడను జైలుకు పంపడానికి రెడీగా ఉన్నారు. కాగా ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పోసాని కృష్ణ మురళి అరెస్టు కూడా జరిగినా.. ఇటీవల ఆయనకు బెయిల్ లభించింది.