ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. శనివారం శాసనసభలో రాజధాని చట్టబద్ధత తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై జరిగిన దాడులు, రైతుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.
రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, కానీ గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ‘మూడు ముక్కలాట’ ఆడి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. అనుభవజ్ఞుడైన నాయకుడి చేతిలో రాష్ట్రం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరించిందని, దానివల్ల రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఇప్పటికీ ఇబ్బందులు పడుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ స్థిరత్వం అనేది రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమని, అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఎటువంటి షరతులు లేకుండా టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని వివరించారు.
వైసీపీ హయాంలో సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ అరాచక పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం పోరాడిన రైతులను హింసించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలుగు నేల ఒక్కటే అనే భావనతో తాము పని చేస్తున్నామని, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి నాంది పలుకుతుందని డిప్యూటీ సీఎం తన ప్రసంగంలో ధీమా వ్యక్తం చేశారు. రాజధాని లేని లోటును తీరుస్తూ, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.






































