ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా, మండలిపై నిర్ణయం?

2020 AP Assembly Session, Andhra Pradesh Latest News, AP 3 Capitals, AP Assembly Postponed To Monday, AP Breaking News, AP Capital Issue, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమై నాలుగు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు, ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు, విద్యా చట్ట సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఈ క్రమంలో నాలుగో రోజు సమావేశాల చివర్లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. స్పీకర్ తమ్మినేని స్పందిస్తూ, మండలి అంశంపై జనవరి 27, సోమవారం నాడు సుదీర్ఘంగా చర్చిద్దామని, సభలో ఎలా నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉందామని పేర్కొన్నారు. అనంతరం శాసనసభను సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.

నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం విషయంలో శాసన మండలిలో జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని చెప్పారు. మండలి చట్టసభలో భాగమైనందున చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని, అయితే ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన వ్యవహారాలను అందరూ చూసారని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను మండలి ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయవచ్చని, అలా కానిపక్షంలో సభలో అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సవరణలతో తిప్పి పంపించవచ్చని తెలిపారు. అయితే సెలెక్ట్‌ కమిటీకి పంపే అవకాశమే లేదని పేర్కొంటూ, విచక్షణాధికారం ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. శాసన మండలి కోసం ప్రతి ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పేదరికంలో కొనసాగుతున్న రాష్ట్రంలో మండలి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందని చెప్పారు. ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మండలిని కొనసాగించాల్సిన అవసరముందా అనేది ఆలోచించుకోవాల్సి ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =