
ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాలలో కౌంటింగ్ ఫీవర్ నడుస్తోంది.దీంతో ఐపీఎల్‌ను మించిపోయిన బెట్టింగులు నడుస్తున్నాయి. జూన్ 4 కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఏ వాట్సాప్ గ్రూపు చూసినా బెట్టింగ్ గురించే టాపిక్ నడుస్తుంది.
ముఖ్యంగా ఏపీలోని కొన్ని కీలక నియోజకవర్గాల విజయాలపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గం, షర్మిల పోటీ చేస్తున్న కడప స్థానాల్లో గెలుపుతో పాటు ఆ నేతల మెజార్టీలపైన కూడా జోరుగా పందేలు కడుతున్నారు.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోవడంతో ఈ సారి కూడా పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. అయితే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని పవన్ బంపర్ మెజార్జీతో గెలవడం ఖాయమని కూటమి నేతలు, జనసేన వర్గాలు వాదిస్తున్నాయి. దీంతో పవన్ మెజార్టీపై పందెంరాయుళ్లు లక్షకు మూడు లక్షలు బెట్టింగులు పెడుతున్నారట.
ఏపీసీసీ అధినేత్రి షర్మిల పోటీ చేస్తున్న కడప ఎంపీ స్థానం పైన కూడా బెట్టింగ్‌ల జోరు సాగుతోంది. వైసీపీ నుంచి బరిలో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి షర్మిల బలంగా పోటీ ఇవ్వడంతో ఈ అక్కాతమ్ముళ్ల మధ్య పోరుపై కడప ఎంపీ సీటుపై పందెం రాయుళ్లు కన్నేశారు. అలాగే గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ ఈసారి గెలుస్తారా అనేదానిపైన ఎక్కువ బెట్టింగులు జరుగుతున్నాయి.