వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఆ పార్టీకీ గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్కు వీరిద్దరూ తమ రాజీనామా పత్రాలను సమర్పించగా..వెంటనే ఆయన వీరి రాజీనామాలను ఆమోదించారు.
వీరిద్దరి రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్లో రెండు పార్లమెంట్ స్థానాలు ఖాళీ అయినట్లు బులెటిన్ విడుదల చేసింది రాజ్య సభ . ఖాళీ అయిన ఈ రెండు సీట్లకు త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపింది. దీనిని వివరిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగేది త్వరలోనే ప్రకటన రానుంది. ఇక ఈ రెండు స్థానాలు కూడా ఎన్డీయేకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మస్తాన్ రావు రెండేళ్లుగా వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉండి కొన్ని వ్యక్తి గత కారణాలతో తాను పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
ఇకపోతే మోపిదేవి వెంకటరమణ మాత్రం టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. అయితే రాజ్యసభ సీటుపై మోపిదేవికి ఆసక్తి లేకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో పాటు మోపిదేవికి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.