తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం నేషనల్ హైవేపైనే వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటు.. శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దర్శనానికి వెళ్లేవారు ఈ హైవే మీదుగానే వెళ్తుంటారు. ఈ రోడ్డుపై పెరుగుతున్న వెహికల్స్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రూట్‌ను విస్తరించడానికి డిసైడ్ అయ్యారు. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ నేషనల్ హైవే.. నల్లమల అడవి అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లబోతోంది.
ఈ రూట్ 62 కి.మీటర్ల దూరం రెండు లేన్ల ఘాట్లతో ఇరుకుగా ఉండటంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవతున్నాయి. ఈ ప్రాంతంలో టర్నింగ్‌ల వల్ల..ప్రజలతో పాటు చాలా వన్యప్రాణులు కొన్నాళ్లుగా ప్రమాదానికి బారిన పడుతున్నాయి. దానికి తోడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టగా.. ఈ కారిడార్‌కు మోదీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్ వయా నల్లమల ఫారెస్ట్ మొత్తం 62 కి.మీటర్ల మేర అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తులో ఈ కారిడార్ నిర్మించబోతున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7,700 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు ఈ కారిడార్ వెళ్తుంది. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరలో ప్రత్యేక ఆకర్షణగా ఐకానిక్ వంతెనను కూడా నిర్మించ బోతున్నారు. కాగా ప్రాజెక్టు నిర్మాణానికి 370 ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది.
వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. అక్కడున్న చెట్లకు నష్టం కలుగకుండా భూసేకరణకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయి.. అందుబాటులోకి వస్తే మాత్రం ప్రయాణ ఇబ్బందులు దూరం అయినట్లే.
ప్రస్తుతం రాత్రి వేళల్లో అభయారణ్యంలో వాహనాల ప్రవేశానికి నిషేధం ఉంది. 30 అడుగుల ఎత్తులో ఉండే కారిడార్ వల్ల.. ఆ నిషేధాన్ని ఎత్తివేస్తారు. 30 అడుగుల ఎత్తులో కారిడార్ ఉండడం వల్ల.. అడవిలో ఉన్న జంతువులకు రోడ్డు ప్రమాదాల నుంచి భద్రత కలుగుతుంది.అలాగే ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాంతం రవాణా, పర్యాటక పరంగా మరింతగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది.
రహదారిని విస్తరించాక ఎలివేటెడ్ కారిడార్ మీదుగా 24 గంటలు కూడా వాహనాల రాకపోకలు సాగించవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఫ్లైఓవర్ మధ్యలో వాహనాలు ఎక్కి, దిగేలా ర్యాంపులు నిర్మించకూడదని అటవీశాఖ సూచించింది. లైటింగ్ ఎక్కువగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఎలివేటెడ్ కారిడార్‌పై రాత్రిపూట తక్కువ లైటింగ్ పెట్టాలని, నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు గైడెన్స్ ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది.