ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం.. సరికొత్త సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం కూటమి ఘన విజయంతో దాదాపు రాజకీయ వ్యవస్థలన్నీ మారనున్నాయి. గెలుపు జోష్ లో ఉన్న కూటమి నేతలు తర్వాత వేయబోయే అడుగులపై ఆలోచనలు చేస్తున్నారు. అధికారికంగా, రాజకీయంగా తమకు అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. గెలిచిన నేతలు ఉత్సాహంగా ఉండగా, ఓడిన నేతలు ఎందుకిలా జరిగిందని తలుచుకుంటూ మౌనంగా ఉంటున్నారు. మరికొందరు తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ, ఓటమి గల కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్‌లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ఫలితాల అనంతరం నగరి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై విశ్లేషణలు మాని.. భలే ఓడారని సంబరం చేసుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థి ఓడిపోవడంపై వైసీపీ నేతలే ఆనందం వ్యక్తం చేస్తుండడం ఆసక్తిగా మారింది. రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నగరిలో రోజా ఓటమితో ఆమెపై అసమ్మతితో ఉన్న వర్గం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. సెల్ఫీ వీడియోతో తన ఆనందాన్ని పంచుకున్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి. పదేళ్లుగా ‘నగరికి పట్టిన శని విరగడైందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు ఉన్నాడని ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్లుగా నగరిలో కుటుంబ పాలనతో రోజా అక్రమాలకు పాల్పడ్డారని కీలక ఆరోపణలు చేశారు. అందుకే నగరి ప్రజలు రోజాను భూస్థాపితం చేశారన్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల తర్వాత రోజా మౌనంగా ఉన్నారు. నగరిలోని ఇంటికే పరిమితం అయ్యారు. పోలింగ్ రోజే రోజా తన వ్యతిరేక వర్గంపై విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలే తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితం ఎలా ఉండబోతోందో ముందే ఊహించినట్టుగా రోజా మాట్లాడారు. అసమ్మతివర్గం తన ఓటమితో సంబరాలు చేసుకుంటున్నా మాజీ మంత్రి రోజా మౌనంగానే ఉన్నారు. ఈ మౌనం వెనుక ఏమైనా బలమైన చర్యలు ఉన్నాయా.. ఈ పంచాయతీ అధినేత జగన్ దగ్గరకు తీసుకువెళ్తారా.. ఏం చేస్తారు అనేది వేచి చూడాలి.
నగరిలో మొదటి నుంచీ రోజా వర్సెస్ కేజే శాంతి అన్నట్టుగా రాజకీయం నడిచింది. స్వపక్షంలోనే విపక్షంలాగా వీరిద్దరి వర్గాల మధ్య పాలిటిక్స్ కొనసాగాయి. బహిరంగంగానే ఈ రెండు వర్గాలు గొడవ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చివరకు పార్టీ అధినేత జగన్ సైతం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. గతంలో విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా నగరిలో ఓ సభ ఏర్పాటు చేశారు. ఆ వేదికపైనే ఇద్దరి చేతులు కలిపేందుకు జగన్ ప్రయత్నించారు. అయితే.. రెడ్డిశాంతి రోజాకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. మొహమాటంగా చెయ్యి కలిపినా.. ఆ చిరునవ్వు స్టేజ్ దిగకముందే చెరిగిపోయింది. రోజాను ఏమాత్రం అంగీకరించని శాంతి వర్గం అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఏకంగా 45 వేల ఓట్ల తేడాతో రోజా ఓడిపోయారు. రోజా ఓడిపోవడం చాలా ఆనందంగా ఉంది, ఆమె చేసిన అరాచకాలు భరించలేకే నగరి ప్రజలు తరిమికొట్టారంటూ కేజే శాంతి వీడియో రిలీజ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY