రైతులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతులకు శుభవార్త ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక ప్రకటన చేస్తూ, రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందించే ₹6,000 తో పాటు, అదనంగా ₹14,000 ను మూడు విడతల్లో రైతులకు అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏప్రిల్‌లోనే మొదటి విడత అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాయాన్ని కిసాన్ సమ్మాన్ నిధి తో కలిపి పంపిణీ చేస్తామని తెలిపారు.
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలన వల్ల రైతులు నష్టపోయారని, నూతన ప్రభుత్వం వారి అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.
అన్నదాత సుఖీభవ ద్వారా రైతు భరోసా పథకం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా, మత్స్యకారులకు రూ.20,000 అందించనున్నట్లు ప్రకటించారు. అదనంగా, పింఛన్లకు ఏటా ₹34,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు.
రాజధాని నిర్మాణంపై కూడా చంద్రబాబు కీలక ప్రకటన చేస్తూ, అభివృద్ధికి బలమైన పునాది వేస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ప్రతి ఒక్కరు గర్వపడేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.