2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. సింగిల్‌గా పోటీ చేసి 151 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. కానీ 2024కి వచ్చే సరికి పరిస్థితి ఒక్కసారిగా తారుమారైపోయింది. గెలవడం కాదు కదా.. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కొందరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఫ్యాన్ కిందికి వెళ్లారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడం.. ఆ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడం.. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొనడంతో.. వారంతా తిరిగి కూటమి వైపు చూస్తున్నారట. వాస్తవానికి అప్పట్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతలు పెద్దగా న్యాయం జరగలేదు. వైసీపీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఇన్నిరోజులు ఆ పార్టీలో కొనసాగారు.
అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కూటమి ప్రభుత్వం తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈక్రమంలో గతంలో టీడీపీని వీడి వెళ్లిన నేతలంతా మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పదవులు దక్కకపోయినా అధికార పక్షంలో ఉంటే తమ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుందని ఆ నేతలు భావిస్తున్నారట. అందుకే టీడీపీ హైకమాండ్‌తో వారంతా మంతనాలు జరుపుతున్నారట. సందు దొరికితే టీడీపీలోకి దూరిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీ హైకమాండ్‌తో టచ్‌లోకి రాగా.. వారి చేరికను హైకమాండ్ హోల్డ్‌లో పెట్టినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ డైరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీ తరుపున విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఫలితాల తర్వాత నుంచి ఆయన వైసీపీ కార్యకలాపాలకు.. హైకమాండ్‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీ సమీక్షలకు కూడా హాజరు కావడం లేదు. ఈక్రమంలో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడయిన ఓ సీనియర్ నేత మూడేళల క్రితం వైసీపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు వైసీపీ హైకమాండ్ మొండి చేయి చూపించింది. దీంతో ఆయన ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారట. గంటా శ్రీనివాస్ ద్వారా టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారట.
వారితో పాటు విశాఖకు చెందిన ఓ మున్సిపల్ చైర్ పర్సన్ పలువురు కౌన్సిలర్లు కూడా కూటమిలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాకుండా గతంలో టీడీపీ, జనసేన పార్టీలను వీడి వైసీపీలో చేరిన చాలా మంది ఎమ్మెల్యేలు తిరిగి కూటమి వైపు చూస్తున్నారట. మరికొద్దిరోజుల్లో వైసీపీ నుంచి కూటమిలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని.. వైసీపీ ఖాళీ అయినా అవ్వొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ