ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు వారికి సమాచారం ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారనే కేసులో మాజీమంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయగా..ప్రస్తుతం ఇదే కేసులో గోపిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని.. శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విడదల రజిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని గట్టి ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ తనిఖీల పేరుతో వారిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో మార్చి మొదటి వారంలో ఏసీబీ కేసు నమోదు చేసి.. మాజీ మంత్రి విడదల రజినిని ఏ 1గా చేర్చారు. రజినీతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాను ఏ2గా , రజిని మరిది గోపిని ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా పోలీసులు పేర్కొన్నారు. విడదల రజని వాటాగా రూ.2 కోట్లు తీసుకున్నట్లు ఈ కేసులో నమోదు చేశారు. ఆమె మరిది గోపికి, జాషువాకు చెరో రూ.10 లక్షలు ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు. శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోద చేశారు.
అయితే విడదల రజినితో పాటూ మరిది గోపీనాథ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించి.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తమపై ప్రతీకారంతోనే ఈ కేసు నమోదు చేసిందని.. ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయని వారి లాయర్లు వాదనలు వినిపించారు. నేరారోపణ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగితే.. తాజాగా ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసమే సెక్షన్ 386ను చేర్చారని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిలివ్వాలని విడదల రజినీ లాయర్లు కోరారు.
దీంతో మాజీ మంత్రి రజిని, ఇతర నిందితులు తనిఖీల ముసుగులో శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యంపై బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. యడ్లపాడుకు చెందిన స్టోన్ క్రషర్ యజమానులను రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ బెదిరించిన విషయాలను హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆమె అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని..ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని ఏజీ కోరారు. ఈ పిటిషన్‌పై రెండువైపులా వాదనలు ముగియగా..ఈ తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఇటీవల ప్రకటించారు. అయితే ఈలోపు మాజీమంత్రి విడదల రజిని మరిది గోపీ అరెస్ట్ కలకలం రేపింది.