మొన్నటి వరకు ఏపీలో అధికారంలో కొనసాగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీనే ఓడించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 స్థానాల్లో జెండా పాతింది. అయిదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రజాబలాన్ని మాత్రం పెంచుకోలేకపోయింది. పైగా జనాల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. 2024 ఎన్నికల ఫలితాలను చూస్తే అది క్లిస్టర్ క్లియర్‌గా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి 151 స్థానాల్లో గెలుపొందిన వైసీపీ.. ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. అంటే ఎంతలా ప్రజలు వైసీపీని దూరం పెట్టారో అర్థం చేసుకోవచ్చు. మరి అంతాల వైసీపీని ప్రజలు దూరం పెట్టడానికి కారణం ఏమయి ఉండొచ్చనేది చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైసీపీ ఓటమి గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్నాయి. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో.. వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఓటమి తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఓటమికి సంబంధించి రకరకాల కారణాలు చెప్పారు. ప్రజలకు మంచి చేసినా ఓడిపోయామని ఒకరంటే..లిక్కర్ పాలసీ వల్ల ఓడిపోయామని మరొకరు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఓడిపోయామని మరో నేత చెప్పుకొచ్చారు. ఇలా వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
అయితే ఇన్నిరోజులు ఎవరూ స్పందించన విధంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. సంచలన విషయాలను బయట పెట్టారు. వైసీపీ ఓటమికి సంబంధించి మరో కీలక కారణం చెప్పారు. నియోజకవర్గాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులకు కూడా నిధులు విడుదల అయ్యేవి కాదని సంచలన బాంబు పేల్చారు. నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నవించుకున్నప్పటికీ.. సీఎంవో అధికారులు నిధులు మంజూరు చేసే వారు కాదని వెల్లడించారు. జగన్ ప్రియారిటీలు ఒకలా ఉంటే.. సీఎంవో అధికారుల ప్రియారిటీలు మరోలా ఉండేవని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా తనకు జరిగిన అనుభవాన్ని కూడా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెల్లడించారు. తన నియోజకవర్గంలో ఓ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం జగన్‌ను కలిశానని.. రూ. 10-15 కోట్లు మంజూరు చేయాలని కోరానన్నారు. జగన్ సీఎంవోలోని ధనుంజయ్ రెడ్డి అనే అధికారికి చెప్పారని.. కానీ వారు మాత్రం నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు. ఎన్నోసార్లు ఆ నిధుల కోసం సీఎంవో చుట్టూ తిరిగానని అయినప్పటికీ నిధులు విడుదల చేయలేదన్నారు. దీంతో ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరగలేదన్నారు. సీఎంవోలోని అధికారులు నిధులు విడుదల చేయకపోవడం వల్ల తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేకపోయామని వివరించారు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ అధికారులు నిధులు మంజూరు చేయలేదని కేతిరెడ్డి చెప్పడం సంచలనంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY