ఏపీలో జీబీఎస్ అంటే గులియన్-బారే సిండ్రోమ్ బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యశాఖ అధికారులు చెప్పారు. నాలుగు రోజుల్లో ఏడుగురు జీబీఎస్ బాధితులు గుంటూరు జీజీహెచ్‌కు ట్రీట్మెంట్ కోసం రాగా.. వీరిలో ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఐదుగురిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా మరొకరు ఐసీయూలో ఉన్నారు.
మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు పరామర్శించారు. ఈ వ్యాధి పట్ల ప్రభుత్వ సంసిద్ధత, మందుల లభ్యతతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై డాక్టర్లతో మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా సాధారణ స్థాయిలోనే జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జీబీఎస్ ట్రీట్మెంట్లో భాగంగా ఇమ్యూనో గ్లోబిన్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచామన్నారు.
జీబీఎస్ సిండ్రోమ్ వల్ల..కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం, నరాల బలహీనత, గొంతు పొడిబారి పోవడం, ఆహారం తీసుకోలేకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. ప్రాథమిక పరీక్షల తర్వాత వచ్చిన వారికి ఇమ్యూనో గ్లోబిన్ ఇంజెక్షన్ ఇస్తున్నామని అన్నారు. ఇప్పటివరకూ జీజీహెచ్ లో ఎటువంటి మరణాలు లేవన్నారు.
నిజానికి జీబీఎస్ కొత్తగా వస్తున్న వ్యాధి కాదని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు చెప్పారు. ప్రతి లక్ష మందిలో ఒకరో ఇద్దరో ఈ వ్యాధి బారిన పడతారని అన్నారు.దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక ప్రాంతానికో, ఒక ప్రత్యేక కారణం వల్లో జీబీఎస్ వ్యాధి వస్తున్నట్లు ఇప్పటివరకూ తేలలేదన్నారు. శానిటేషన్ మెయింటెయిన్ చేసుకోవడంతో పాటు వ్యక్తిగతమైన పరిశుభ్రత పాటించడం, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.