విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కీలక సంస్కరణలు: మంత్రి లోకేశ్

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. గత పాలకుల వైఫల్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, ఇకపై విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని ఏప్రిల్‌ 24 తర్వాత ఆయా కాలేజీల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో టీచర్లపై పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందని పేర్కొన్నారు.

విద్యా రంగ సంస్కరణలు
విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు గల ప్రధాన కారణం జీఓ-117 అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో పదిమంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలు 1,215 మాత్రమే ఉండగా, అదే నిబంధనల కారణంగా ప్రస్తుతం ఆ సంఖ్య 5,500కి పెరిగిందని వివరించారు. అలాగే, 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలల సంఖ్య 5,520 నుంచి 12,512కు పెరిగిందని వెల్లడించారు.

ప్రతి గ్రామంలో నమూనా ప్రాథమిక పాఠశాల
ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఒక నమూనా ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని సంకల్పించిందని మంత్రి తెలిపారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామని, ఉపాధ్యాయులకు పాఠశాలలు ప్రారంభానికి ముందే తగిన శిక్షణ ఇస్తామని తెలిపారు. దీనికోసం అమరావతిలో ప్రపంచ స్థాయి శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉందని వివరించారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచి, బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.

డీఎస్సీ నియామక ప్రక్రియ ఈ ఏడాదిలోనే పూర్తి
ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక అందిందని, ప్రభుత్వం దీన్ని పరిశీలించిన తర్వాత ఎస్సీ కమిషన్‌కు పంపిస్తుందని మంత్రి లోకేశ్ చెప్పారు. కమిషన్ నోటిఫికేషన్‌ ఇచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని, ఈ ఏడాదిలోనే నియామక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. విద్యార్థుల పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో 8 పుస్తకాలు ఇచ్చేవారని, ఇకపై మొదటి తరగతి విద్యార్థులకు ఒక్కో సెమ్‌లో 2 చొప్పున మొత్తం 4 పుస్తకాలు మాత్రమే అందజేస్తామని, అన్ని తరగతుల్లో ఇదే విధానాన్ని అమలు చేసి పిల్లల బ్యాగ్‌ బరువు తగ్గిస్తామని వివరించారు.