నింగిలోకి GSLV-F15.. ఇస్రో సిగలో మరో రికార్డ్‌..

GSLV-F15 Another Record in ISRO's History

ఇప్పటికే ఎన్నో విజయాలను సాధిస్తూ ప్రపంచం చూపును భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా మరోసారి సరికొత్త రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేసిన ఇస్రో.. ఇప్పుడు తన 100వ రాకెట్‌ను ప్రయోగించి ఆ సక్సెస్ ఖాతాను కూడా యాడ్ చేసుకుంది ఇస్రో. నెల్లూరులోని శ్రీహరి కోట నుంచి ఈరోజు ఉదయం 6 గంటల 23 నిమిషాలకు గంటలకు GSLV-F15ని నింగిలోకి ప్రయోగించి సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.

భారతదేశం గర్వించదగిన వాటిలో ఒకటి..ఇస్రో అంతరిక్ష పరిశోధనా కేంద్రం. ప్రపంచ దేశాలు పోటీ పడి అంతరిక్ష పరిశోధనలు చేస్తుండగా.. ఇస్రో కూడా వాటికి సమానంగా ఎన్నో అధ్యయనాలు చేపడుతూ.. ప్రయోగాలు చేస్తూ యావత్ ప్రపంచానికి అంతరిక్ష రంగంలో సవాల్ విసురుతోంది. చంద్రయాన్, మంగళయాన్‌తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా ఇస్రో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసింది. ఈ దశలో ఇప్పుడు తన 100వ రాకెట్‌ను ప్రయోగించి ఇస్రో మరో చారిత్రక కీర్తిని అందుకుంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్‌ నారాయణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణన్‌ ఛైర్మన్ అయ్యాక జరిగిన తొలి ప్రయోగం ఇదే కావడం విశేషం.

నావిక్‌ అనేది భారత్ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన జీపీఎస్‌కు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కి.మీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు కచ్చితమైన స్థానం, వేగం, సమయం వంటి సేవలను అందించడమే దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్‌తో దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ మరింత విస్తృతం కాబోతుంది. ఈ నావిక్ ఉపగ్రహాన్ని బెంగళూరులోని శాటిలైట్‌ సెంటర్‌లో రూపొందించగా.. ఇతర శాటిలైట్‌ సెంటర్లు దీనికి సహకారం అందించాయి.

నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారతీయ వినియోగదారులకు కచ్చితమైన ప్లేస్, వేగం, టైమ్ వంటి సేవలను అందించడానికి రూపొందించబడింది. ఈ సేవల కొనసాగింపును నిర్ధారించడానికి ఇస్రో NVS-01/02/03/04/05 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది .

NVS-02 ఈ NVS సిరీస్‌లో రెండవ ఉపగ్రహం కాగా దీని బరువు 2250 కిలోలు, పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ 3 కిలో వాట్స్ గా ఉంది. ఇది కచ్చితమైన సమయ అంచనాను నిర్ధారించడం కోసం NVS-02 స్వదేశీ, దిగుమతి చేసుకున్న రుబిడియం అటామిక్ గడియారాలతో కలిపి అమర్చారు శాస్త్రవేత్తలు. దీని జీవితకాలం సుమారు 12 ఏళ్లు అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.