ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్‌బై చెప్పారు. గత కొన్ని రోజులుగా ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఆయన రాజీనామా నిర్ణయం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపించినట్లు తెలుస్తోంది.
తన రాజీనామా వెనుక వ్యక్తిగత కారణాలే ఉన్నాయని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు, బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబు, పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే భవిష్యత్తులో మరో రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, తాను న్యాయవాద వృత్తిని కొనసాగిస్తానని ప్రకటించారు.
తాజాగా జీవీ రెడ్డి ఫైబర్ నెట్‌లో చోటు చేసుకున్న అనేక విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపులపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సంస్థను దెబ్బతీసేందుకు కొందరు అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అనుకూలంగా ఉన్న ఉద్యోగులను తొలగించినప్పటికీ, ఎండీ ఈ చర్యలకు సహకరించలేదని ఆరోపించారు.
ఫైబర్ నెట్ సంస్థ గత తొమ్మిది నెలల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని, ఎండీ దినేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా సంస్థను మూసివేయాలనుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు, కొంతమంది ఉద్యోగులు సంస్థకు నష్టం కలిగించేలా, వైసీపీకి సహకరించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరుపై సీఐడీ లేదా విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలని కోరతానని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. ఈ ఆరోపణలపై పలువురు ఐఏఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ వివాదం చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో రెండు రోజుల క్రితం జీవీ రెడ్డి, సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు. ఫైబర్ నెట్‌లో జరుగుతున్న పరిణామాలను సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. వివాదాలను పరిష్కరించుకునేందుకు ఎండీ దినేష్ కుమార్‌తో చర్చలు జరపాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని పరిశీలించే బాధ్యతను మంత్రి జనార్దన్ రెడ్డికి అప్పగించారు.
అయితే, ఈ పరిణామాల తర్వాత జీవీ రెడ్డి రాజీనామా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇది ఏపీ ఫైబర్ నెట్‌లో కొనసాగుతున్న అసలైన సమస్యలపై మరింత చర్చకు తావిస్తోంది. ఆయన రాజీనామా నేపథ్యంలో, ఫైబర్ నెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడాల్సిందే!