వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని, అన్ని శాఖలు అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని అన్నారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్‌కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతన్నాయి. నందిగామ మండలంలో నల్లవాగు, వైరా, కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అడిరావులపాడు వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట-నందిగామ మార్గంలో, దాములూరు-వీరులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో ఎడతెరపి లేని వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. అన్ని యాజమాన్య పాఠశాలలకు కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు. ప్రకాశం బ్యారేజ్‌లోని మొత్తం 70 గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. విశాఖలో ఎడతెరిపి లేని వర్షాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.