
పోలింగ్ ముగిశాక కూడా ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ లేవు. గెలిస్తే అధికార పక్షం.. లేకుంటే ప్రతిపక్షం అన్నీ రీతిలో ఆయా పార్టీలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసేవి. ఈసారి ఏ పార్టీ గెలిచినా.., మరో పార్టీకి, ఆ పార్టీ నేతలకు ఇబ్బందులు తప్పవన్న సంకేతాల నేపథ్యంలో ఏపీ ఎన్నికలు ప్రత్యేకంగా మారాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. జనసేన, బీజేపీలతో కలిపి తీవ్రస్థాయిలో ప్రచారం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేలా హామీలు ఇవ్వడమే కాదు.. ఆ పార్టీ వస్తే అలా జరుగుతుంది, ఈ పార్టీ వస్తే ఇలా జరుగుతుంది.. అంటూ భయపెట్టి మరీ ఓట్లు వేయించుకునేలా ప్రచారం చేపట్టాయి. నేతల మాటలకు ఆకర్షితులయ్యారో, విసిగిపోయారో తెలియదు కానీ.. ఓట్లు వేసేందుకు జనం పోటెత్తారు. అర్ధరాత్రి వరకూ లైన్లలో నిలబడి మరీ బటన్‌లు నొక్కారు.
ఎన్నడూలేని రీతిలో 2024 ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైంది. నాలుగోదశలో ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనూ ఆ స్థాయిలో పోలింగ్ లేదు. రికార్డుస్థాయిలో 81.86 శాతం నమోదైంది. ఈనేపథ్యంలో దేశం మొత్తంమ్మీద ఏపీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. సాయంత్రం 6 దాటాక కూడా సుమారు 3000 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. చివరి కేంద్రంలో అర్దరాత్రి 2 వరకు కూడా ఓటర్లు క్యూలో నిలబడి ఓటేశారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాలుగో దశలో పోలింగ్ జరిగిన ఏ రాష్ట్రంలోనూ ఈస్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ పోలింగ్ శాతం పెంపులో తమ లక్ష్యం నెరవేరిందన్నారు. వర్షం వల్ల కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైనట్లు తెలిపారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 79.77 శాతం నమోదైనట్లు ఎంకే మీనా తెలిపారు.
ఏపీలో మొత్తంలో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 పోలింగ్ శాతం నమోదుకాగా, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం పోలింగ్ నమోదైంది. కుప్పంలో 89.88, ప్రకాశం, చిత్తూరులో 87.09 శాతం పోలింగ్ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా విశాఖలో శాతం 71.11 పోలింగ్ నమోదైంది. అసెంబ్లీకి ఓటేసిన వారిలో కొందరు లోక్‌సభకు ఓటు వేయలేదని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3,33,40,333 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, పార్లమెంట్ ఎన్నికల్లో 3,33,4,560 ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, 350 స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలను భద్రపరిచారు.
అత్యధిక పోలింగ్ నమోదైనప్పటి నుంచీ.. నేతలందరిలోనూ హైటెన్షన్ నెలకొంది. ఎవరిని గద్దెనెక్కించేందుకు లేదా ఎవరిని దించేందుకు ఓటర్లు ఇంత కసిగా ఓట్లు వేశారో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. నాటి పోలింగ్ సరళిపై నేటికీ లెక్కలు వేసుకుంటూనే ఉంటున్నారు. ఆశ్చర్యపరిచేరీతిలో 23 లోక్‌సభ, 140 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని తెలుగుదేశం చెబుతుంటే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ వైసీపీ అధినేత జగన్ సంచలన ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల మార్క్ దాటి ఈఎన్నికల్లో ఫలితాలు సాధిస్తామని ప్రకటించారు. జగన్ అంచనాలపై తాజాగా ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ ఈఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని మరోసారి ప్రకటించారు. అటు పెరిగిన పోలింగ్ శాతం, ఇటు పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY