ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే.. నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచే ఎండలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారానికి మిడ్ సమ్మర్ వాతావరణం కనిపించింది .
ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అప్పుడే సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు పెరుగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.ముఖ్యంగా ఏపీలో ఐదు ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్న అధికారులు.. 38 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కొద్ది రోజులుగా ఉదయం 10 గంటలకే ఎండలు గట్టిగా మండిపోతుండగా..రాత్రులు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు రోజులుగా కర్నూలులో ఏకంగా 37.8° అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా సాధారణం కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. ఫిబ్రవరి మూడో వారంలో అడుగుపెట్టడంతో ఎండల తీవ్రత మరింతగా కనిపిస్తోంది. సముద్ర జలాల కాలుష్యం.. ఎలినో ప్రభావం చూపడంతోనే ఇంత ఎర్లీగా ఎక్కువ ఉష్ణోగ్రతల నమోదుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు.
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ఏడాది మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమలో ఎండల తీవ్రత బాగా పెరిగింది. శివరాత్రి నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.