
ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు ఆయా పార్టీల రెబల్స్ వణుకుపుట్టిస్తున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు వంటివారిని రెబల్స్ షేక్ చేస్తున్నారు.ఏపీలో మొత్తం 16 నియోజకవర్గాల్లో రెబల్స్ ప్రభావం ఉండటంతో..కూటమి అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. నిజానికి 30కిపైగా నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో ఉండగా..వారిలో 14మందిని నయానో, భయానో తప్పించినా..మిగిలిన 16మంది బెడద ఇప్పుడు అభ్యర్థులకు తప్పడం లేదు.
ఏపీలో కూటమి కట్టిన మూడు పార్టీల మధ్య.. ఆది నుంచి ఏదో కనిపించని అగాధం ఉందన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కూటమిలోని మిగిలిన బీజేపీ, జనసేన పార్టీలపై టీడీపీ అధిపత్యం చలాయిస్తోందనే వాదన వ్యక్తమవుతోంది. నిజానికి 40 సీట్లనుంచి 21 సీట్లకు తమ సంఖ్యను తగ్గించుకున్నా కూడా అందులో మెజార్టీ సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇచ్చారు. అలాగే బీజేపీకి కేటాయించిన 10 సీట్లలోనూ కొన్నిచోట్ల టీడీపీ నుంచి వారికే టికెట్లు కట్టబెట్టారు. మరోవైపు ఈ రెండు పార్టీల నేతలతో పాటు..కూటమి పొత్తులంటూ తమ సీట్లకే ఎసరు పెట్టారంటూ టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
ఇక టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పూసపాటి ఆదితి గజపతిరాజు, పరిటాల సునీతకు రెబల్స్ బెడద కనిపిస్తోంది. ఉండిలో రఘురామకృష్ణరాజుపై మాజీ శివరామరాజు మండిపడుతున్నారు. పార్టీలో చేరిన రెండు రోజుల్లోనే రఘురామకు టికెట్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే హిందూపురాన్ని తన కంచుకోటగా మార్చుకున్న బాలకృష్ణను ఈ సారి శ్రీపీఠం పీఠాధిపతి, కమలం పార్టీ నేత పరిపూర్ణానంద వణుకు పుట్టిస్తున్నారు. హిందూపురం అసెంబ్లీ, లోక్‌సభ సీటు నుంచి పోటీ చేస్తున్న పరిపూర్ణానంద.. హిందూ ఓట్లను చీల్చితే.. బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల మైనార్టీ ఓట్లు వైఎస్సార్సీపీకి మళ్లే పరిస్థితులు కనిపించడంతో బాలకృష్ణకు టెన్షన్ పెరుగుతోంది. ఇటు రాప్తాడులో పరిటాల సునీత పైన కూడా రెబల్ పోటీకి దిగడంపై అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు రెబల్ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు.
మరోవైపు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా టీడీపీ రెబల్‌గా పోటీలో నిలిచారు. విజయనగరంలో తెలుగు దేశం పార్టీ తరఫున సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేస్తున్నారు.బలమైన సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత..ఆ నియోజకవర్గంలో భారీగా ఓట్లు చీల్చే పరిస్థితులు కనిపించడంతో.. ఆదితి గెలుపుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. అలాగే కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడం కూటమికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY