బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లగా బలపడింది. దీనివల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో.. ఇటీవల ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిన విషయం తెలిసిందే. సముద్రతలం నుంచి 1.5 కి.మీ, ఎత్తులో తూర్పు-మధ్య బంగాళాఖాతానికి విస్తరించిన ఈ సైక్లోన్ సర్క్యుట్ మెల్లగా తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం, పుదుచ్చేరి, శ్రీలంక వైపు కదులుతోంది.
దీని ప్రభావంతోనే బుధ, గురు వారాల్లో ఏపీలో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అధిక వర్షాలు పడ్డాయి. 24 గంటల వ్యవధిలో దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలపై.. అల్పపీడన ప్రభావం ఎక్కువగా కనిపించింది.నెల్లూరు జిల్లాలకు ఆనుకుని ఉన్న తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
నెల్లూరు జిల్లాలోని కావలి, తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో అయిదు సె.మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. నెల్లూరు సిటీలో నాలుగు సె.మీటర్ల మేర వర్షం కురిసింది. కందుకూరు, గూడూరుల్లో మూడు సె.మీటర్లు, కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో రెండు, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఒక సె.మీటర్ మేర వర్షం పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదే తీవ్రత ఈరోజు, రేపు ఉండొచ్చని వాతావరణ కేంద్ర అధికారులు అంచనా వేసారు. ఈరోజు రేపు అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కడప, కృష్ణా, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.