భారత రాజకీయాలను ప్రభావితం చేసిన మహిళా నేతలు

Most Influential Women Political Leaders Of India
ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పురుషులతో సమానంగా రాజకీయాలు, విద్య, వైద్య, వ్యాపార, అంతరిక్షం, టెక్నాలజీ, బ్యాంకింగ్, క్రీడలు వంటి పలు రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తూ సాధికారత సాధన దిశగా గొప్ప అడుగులు వేస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా భారత రాజకీయరంగంలో తమదైన ముద్ర వేసి, రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన కొందరు మహిళా నేతలు గురించి తెలుసుకుందాం.

ఇందిరాగాంధీ:

జననం: 19 నవంబర్, 1917
మరణం: 31 అక్టోబర్ 1984
భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి. ఆమె తన రాజకీయ చాకచక్యం మరియు నైపుణ్యాలతో భారత రాజకీయ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. దేశంలో ఎన్నో సంస్కరణలకు బాటలు వేసి, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది. తన రాజకీయ జీవితంలో ఎమర్జెన్సీ నిర్ణయంతో పాటుగా మరి కొన్ని విమర్శలు ఎదురుకున్నపటికి ఇందిరాగాంధీ అనే పేరుకు భారతరాజకీయ చిత్రంపై ఎప్పటికి చెరగని ముద్ర ఏర్పడింది.

సోనియా గాంధీ:

తన భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అభ్యర్ధనల మేరకు 1997లో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుండి కొన్నాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగారు. ఒడిదుడుకులు ఎదుర్కున్న పార్టీని ఒక్క తాటిపైకి తెచ్చి కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర వహించారు. స్వేచ్చా స్వతంత్ర్యాలు ఎక్కువుండే కాంగ్రెస్ పార్టీలో నాయకులందరినీ ఒకే బాటలో నడిపిస్తూ, దేశ రాజకీయాలలో ముఖ్య భూమిక పోషించారు.

ప్రతిభా పాటిల్:

న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు. అనంతరం రాజకీయాల్లో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. రాజస్థాన్‌ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్‌ గా ఎన్నికయ్యారు. 2007 నుంచి 2012 వరకు భారతదేశ రాష్ట్రపతిగా వ్యవహరించి ఎంతో పేరు సంపాదించారు. దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై గుర్తింపు పొందారు. ఏ బాధ్యతలు చేపట్టినా సరికొత్త విధానాలతో మహిళలకు ప్రేరణగా నిలిచారు.

సుష్మా స్వరాజ్:

జననం: 14 ఫిబ్రవరి, 1952
మరణం: 6,ఆగస్ట్ 2019
విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని అత్యంత ప్రభావవంతమైన నేతగా ఎదిగారు. బీజేపీ లాంటి జాతీయ పార్టీకి మొదటి మహిళా అధికార ప్రతినిధిగా నియమితులై సరికొత్త చరిత్ర సృష్టించారు. 25 సంవత్సరాల వయస్సులో మంత్రి పదవి చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత విదేశాంగ మంత్రిగా ఎంతో సమర్ధవంతముగా వ్యవహరించి పేరు ప్రఖ్యాతలు గడించారు. తనదైన శైలి రాజకీయాలతో ప్రత్యర్థి పార్టీ నాయకులతో కూడా అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి గొప్ప రోల్ మోడల్ గా నిలిచారు.

షీలా దీక్షిత్:

జననం: 31, మార్చ్ 1938
మరణం: 20, July 2019
భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్ల ఆసక్తులై రాజకీయాల్లో ప్రవేశించారు. నెహ్రూ-గాంధీ కుటుంబాలకు అత్యంత సన్నితంగా ఉండేవారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేశారు. పాలనలో తన ముద్రతో ఎంతో మందికి ఇష్టమైన నేతగా మారారు. కొంతకాలం గవర్నరుగానూ పని చేశారు.

జయలలిత:

జననం: 24, ఫిబ్రవరి 1948
మరణం: 5, డిసెంబర్ 2016
తమిళనాడు రాష్ట్రంలో ప్రజలందరి చేతా అమ్మగా పిలువబడుతూ, అత్యంత బలమైన, ఆకర్షణీయమైన నేతగా ఎదిగారు. పలు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఆమె సాధించిన విజయాలు, బలమైన రాజకీయ నిర్ణయాలతో ఒక శక్తిగా మారారు. తన రాజకీయ జీవితంలో మొదటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ చలించని పోరాట పటిమతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

మాయావతి:

1984లో కాన్షిరాం నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1995 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఎన్నికై చరిత్ర సృష్టించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, రాజకీయాల్లో మహిళలు ఏదైనా సాధించగలరని నిరూపించారు.

మమతా బెనర్జీ:

దీదీగా పిలవబడే ఈమె ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముందుగా 1997లో ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించి అతి తక్కువ కాలంలో రాష్ట్రంలో కీలక స్థానానికి చేరుకున్నారు. భారతదేశపు మొదటి మహిళా కేంద్ర రైల్వే మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు, అలాగే బెంగాల్ లో మరోసారి అధికారం సాధించుకునే దిశగా సాగుతున్నారు.

వసుంధరా రాజే:

1984 లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే రాజస్థాన్ లోని కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. బీజేపీ పార్టీలో అనేక పదవులు చేపట్టారు. రెండుసార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

నిర్మలా సీతారామన్:

2006 లో బిజెపిలో చేరి పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. ప్రస్తుతం అతికీలకమైన ఆర్థికశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2014 లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా, అలాగే 2017లో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిరా గాంధీ తర్వాత దేశంలో రక్షణ శాఖ మంత్రిగా, ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మహిళగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

స్మృతీ ఇరానీ:

టెలివిజన్ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందారు. తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటూ ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. గత రెండు పర్యాయాలుగా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 18 =