ఏపీలోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సోమవారం వరకు 20 వేల దరఖాస్తులు మాత్రమే రాగా… బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 57 వేల 709కు చేరింది. కేవలం ఈ రెండు రోజుల్లోనే ఏకంగా 37 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తు ఫీజుల రూపంలోనే బుధవారం సాయంత్రం వరకూ రూ.1,154 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంకా రేపటి వరకూ గడువు ఉండటతో ఇది మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మద్యం దుకాణాల కోసం లక్ష దరఖాస్తులు వస్తాయని, దీనివల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్ల రూపాయల వరకూ ఆదాయం సమకూరుతుందని మొదట అంచనా వేశారు. ఊహించని స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం గడువును పెంచింది. అలాగే ఎక్సైజ్ శాఖ కూడా దరఖాస్తుదారులకు ఆన్లైన్లో ఎక్కువ వెసులుబాటును కల్పించింది. సమాచారం కోసం ఎక్సైజ్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మొత్తం వివరాలను ఆన్లైన్లో పెట్టింది. దీంతో మంగళవారం నుంచి దరఖాస్తుల వెల్లువ మొదలైంది. దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగించడంతో గురు, శుక్రవారాల్లో ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశముందని… 70వేల దరఖాస్తులు వరకూ వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
గతంలో 2017లో ప్రైవేటు మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. 2017-19 కాలానికి అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 4,380 షాపులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పట్లో దరఖాస్తు రుసుము 25 వేలు, 50 వేలు రూపాయలుగా రెండు రకాలుగా ఉండేది. మొత్తం దరఖాస్తులు 76,329 రాగా.. రూ.473.81 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఇప్పుడు దానికి మూడు రెట్లు ఆదాయం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మద్యం షాపుల పాలసీని అమల్లోకి తేవడంతో.. లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు రుసుముల ఆదాయం లేకుండా పోయింది.
బుధవారం వరకూ ఒక్కో షాపునకు సగటున 17 దరఖాస్తులు రాగా, తిరుపతి జిల్లాలో సగటున 9.8, కాకినాడలో 11, పల్నాడులో 12.5 దరఖాస్తులు, ప్రకాశంలో 12.5, నెల్లూరులో 13.7 చొప్పున మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే తిరుపతి, కాకినాడ జిల్లాల్లో మద్యం విక్రయాలకు ఎక్కువ అవకాశం ఉన్నా కూడా దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. మొత్తంగా గడువు పెరిగిన తర్వాత అనూహ్యంగా దరఖాస్తులు వెలువడటంతో ప్రభుత్వం ఊహించినట్లుగానే ఆదాయం, స్పందన వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.