పది రోజులు దాటుతున్నా విజయవాడ ప్రజలు ఇంకా వరద ముంపులో అష్ట కష్టాలు పడుతున్నారు. ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బుడమేరు ఉప్పొంగడమే కారణమని నిపుణులు తేల్చిచెప్పేశారు. బుడమేరు ఒక్క రాత్రిలోనే అంతలా ఉగ్రరూపం దాల్చడానికి మానవ తప్పిదాలే కారణమని అధికారులు, ఏపీ ప్రభుత్వం కూడా పదే పదే చెబుతూ వస్తోంది.
జలవనరులను ఎడాపెడా ఆక్రమిస్తే వరదలు వంటి విపత్తులు జరిగినపుడు ప్రకృతి ప్రకోపిస్తుందని..దాని ఫలితం ఎలా ఉంటుందో అన్నదానికి ఆ తప్పులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బుడమేరు కాలువ వెంట విచ్చలవిడి ఆక్రమణలు ఇప్పుడు ప్రజల పాలిట శాపంగా మారడంతో… దీనిపై ఏపీ సర్కార్ సీరియస్‌గా దృష్టి పెట్టింది. విజయవాడకు మరో సారి వరద కష్టం రాకుండా ఉండటానికి..బెజవాడకు దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనకు రెడీ అయింది.
మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన హైడ్రా బాగుందని..అలాంటివి ఏపీకి కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. తాజాగా ఆపరేషన్ బుడమేరు చేపట్టి… భవిష్యత్తులో ప్రజలెవరూ ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ నేతల అండతో కొంతమంది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని… ఇక నుంచి చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
బుడమేరు ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజల భద్రత కంటే తమకు మరేమీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు.కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి వచ్చిందని, దీనిని మరోసారి పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
మరోవైపు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. హైడ్రాను ఏపీ ప్రజలతోపాటు రాజకీయ నేతలకు కూడా స్వాగతిస్తున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దీనిపై పాజిటీవ్‌గా స్పందించగా.. ముఖ్యమంత్రి కూడా ఇదే దిశగా చర్యలు తీసుకునేలా కనిపించడంతో ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మరోసారి కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులను, ప్రజలను అలర్ట్ జారీ చేస్తూ… సహాయక చర్యలను కొనసాగిస్తూనే… మరోవైపు విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు అక్రమణల తొలగింపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.