అసంతృప్తి చ‌ల్లారిస్తే.. కూట‌మి హిట్టే.. ఇరుపార్టీల నేత‌లు స‌మాలోచ‌న‌లు

tdp, janasena, ap elections, chandrababu naidu,tdp-janasena,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP,assembly elections,andhra pradesh,Political updates,Mango News Telugu,Mango News
tdp, janasena, ap elections, chandrababu naidu

తాడేపల్లిగూడెం వేదికగా తెలుగుదేశం – జ‌న‌సేన పార్టీలు ఉమ్మ‌డిగా నిర్వ‌హించిన ‘తెలుగుజన విజయ కేతనం’ విజ‌య‌వంతం కావ‌డం కూట‌మి శుభారంభంగా భావిస్తోంది. ఆ స‌భ‌లో ఇరు  పార్టీల అధినేత‌ల ప్ర‌సంగాలు, జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు అటుంచితే.. న‌డుచుకున్న తీరు ఆస‌క్తిగా మారింది. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను సంతోష‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబునాయుడు జ‌న‌సేన జెండా చేత‌బ‌డితే.., ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌సుపు జెండా ఊపుతూ టీడీపీ శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. రాష్ట్రం కోసం పొత్తు మాత్రమే కాదు అవసరమైతే ఏ త్యాగం చేసేందుకైనా తాము సిద్ధమేనన్న సంకేతాల‌ను ఇచ్చారు. స్వార్థ పాలన కోసం రాష్ట్రాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

ఈ స‌భ వేదిక‌గా త‌మ ఉద్దేశం వెల్ల‌డించారు. “ఏపీని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాలనేదే మా సంకల్పం. అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధం. తెలుగు జాతిని ప్రపంచంలోనే నెం.1 స్థానంలో నిలబెట్టేంత వరకు మేం విశ్రమించం. జగన్‌ ఒక బ్లఫ్‌ మాస్టర్‌. పదేపదే అబద్ధాలు చెప్తుంటారు. సొంత బాబాయిని ఎవరు చంపారో జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ వై నాట్‌ 175 అంటున్నారు. కానీ మేము వై నాట్ పులివెందుల అంటున్నాం. జగన్‌ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు. సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి, రాజమౌళిని అవమానించారు. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ ఏమైంది?. మద్యపాన నిషేదం, సీపీఎస్‌ రద్దు ఏమైంది?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

టీడీపీ-జనసేన కూటమి సభతో ఇరుపార్టీల్లోనూ జోష్ పెరిగింది. సీటు రాలేద‌ని, త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని అసంతృప్తిగా ఉన్న నేత‌ల‌ను కూడా దారికి తెచ్చుకుంటే విజ‌యావ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌ని అధినేత‌లు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఈ మేర‌కు ఆదిశ‌గా కార్యాచ‌ర‌ణ ముమ్మ‌రం చేశారు. కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నడుం బిగించారు. ఉండవల్లి నివాసంలో పలు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కొందరిని కోరారు. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీలు ఇచ్చారు. ఇంకొందరు నేతలతో అక్కడి రాజకీయ సమీకరణలపై చర్చించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకూ ఈ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. సీటు ఇవ్వలేదంటే.. మిమ్మల్ని పార్టీ వద్దని అనుకున్నట్లు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

సర్వేలు, రాజకీయ సమీకరణలు, ప్రజాభిప్రాయం మేరకే ఎంపికలు జ‌రిగిన‌ట్లుగా వారికి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  జరిగాయన్నారు. నేతలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయనకు మాటిచ్చారు. అనంతపురం జిల్లా శింగనమల (ఎస్సీ) స్థానానికి శ్రావణి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో అసంతృప్తికి గురైన ముఖ్య నేతలు కేశవరెడ్డి, నర్సానాయుడుతో బాబు మాట్లాడారు. సర్వేల్లో వచ్చిన ప్రజాభిప్రాయం ప్రకారం ఆమెను ఎంపిక చేశామని, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ యంత్రాంగం పనిచేసేలా చూడాలని వారిని కోరారు. పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారికి భవిష్యత్‌లో తగిన అవకాశాలు వస్తాయని చెప్పారు. అదే జిల్లా మడకశిర (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిని కూడా ఆయన పిలిపించారు. యువ అభ్యర్థి అనిల్‌ కుమార్‌కు సహకరించి గెలిపించి తీసుకురావాలని కోరారు. కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా అభ్యర్థి నిర్ణయం జరిగిందని తిప్పేస్వామి ఫిర్యాదు చేయగా.. సర్వేల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని అధినేత చెప్పిన‌ట్లు తెలిసింది.

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అసంతృప్తుల‌ను బుజ్జ‌గిస్తున్నారు. కొంద‌రితో స్వ‌యంగా, మ‌రికొంద‌రితో సోద‌రుడు నాగ‌బాబు, మ‌రోనేత నాదెండ్ల మ‌నోహ‌ర్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని న‌చ్చ‌చెబుతున్నారు. మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో అసంతృప్తి చ‌ల్లారితే విజ‌యావ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌ని భావిస్తున్న టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు ఆదిశ‌గా క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ