ఏపీలో పారిశ్రామిక ప్రగతి..వైసీపీవిష ప్రచారం!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావడానికి చూస్తోంది. దీనిలో భాగంగానే భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పారిశ్రామికవేత్తలను ఒప్పించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం నుంచి భూముల కేటాయింపుతో పాటు రాయితీలు వంటివి ప్రకటిస్తోంది. అయితే ఏపీకి పెట్టుబడులు వద్దు.. కంపెనీలు వద్దు.. ఉద్యోగాలు ఇవ్వద్దు అన్న రీతిలో వైసీపీ కాంగ్రెస్ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తోంది.

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని.. పారిశ్రామిక ప్రగతిని మాత్రం గాలికి వదిలేసింది. చివరకు ఏపీకి వచ్చిన పరిశ్రమలను కూడా తిరిగి వెనక్కి పంపించిన ఘటనలు ఉన్నాయి. దీంతో అమర్ రాజా కంపెనీ తన కంపెనీ విస్తరణకు తెలంగాణకు వెళ్లిపోయింది. ఇలా కొత్త పరిశ్రమల జాడ లేకపోవడంతో.. ఉద్యోగాల కల్పన లేకుండా పోయింది.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టించడంపైనే తన శ్రద్ధ పెట్టింది.ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ తనదైన పాత్ర పోషిస్తుండటంతో.. అధికారంలోకి వచ్చిన 10 నెలలలోనే చాలామంది పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. తన బృందంతో అమెరికా వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీని ఫిలితాలు ఇప్పుడు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో పరిశ్రమలతో పాటు ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటిస్తోంది . మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు.. భూ కేటాయింపులు కూడా చేస్తోంది. ఇది ఎంత మాత్రం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పరిశ్రమలకు భూ కేటాయింపులు, రాయితీలపై విష ప్రచారం చేస్తున్నారు. వాటికి భూ కేటాయింపులు అవసరమా అని ప్రజల్లో ఒక రకమైన అయోమయాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు దీనిలో భాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలతోపాటు.. కాపులుప్పాడలో డేటా సెంటర్ కోసం ఎకరానికి 50 లక్షలు చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెంబర్ 3 లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరా భూమి కోటి రూపాయల చొప్పున.. 3.5 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురావడానికి రెండేళ్ల గడువు విధించింది. ఇవి అందుబాటులోకి వస్తే లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కానీ వైసీపీ దీనిపై విష ప్రచారం చేస్తోంది. అప్పనంగా కంపెనీలకు భూములు కట్టబెడుతుందన్న ఉద్దేశాన్ని బయటపెడుతుంది. కానీ పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి ఏ ప్రభుత్వం అయినా తమ వంతు ప్రయత్నాలు చేసి ప్రోత్సాహకాలు అందిస్తేనే అవి వస్తాయని..దాని వల్ల భవిష్యత్తులో ఆ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని మాత్రం మరిచిపోతుంది.