ఏపీలో పారిశ్రామిక విప్లవం.. అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికరంగ అభివృద్ధికి మరో మైలురాయి చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. తాజాగా, ఆటోమొబైల్ దిగ్గజం అశోక్ లేలాండ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విజయవాడ సమీపంలో ఈ సంస్థ తన అత్యాధునిక బస్సు తయారీ యూనిట్‌ను ప్రారంభించింది.

ఈ భారీ ప్లాంట్‌ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో అధునాతన టెక్నాలజీతో కూడిన డీజిల్, ఎలక్ట్రిక్, డబుల్ డెక్కర్ బస్సులు తయారవుతాయి. ప్రత్యేకంగా, గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించేలా ఈ యూనిట్ నిర్మించబడింది. అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “ఈ కొత్త యూనిట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుంది” అని అన్నారు.

ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో తక్కువ కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, ముఖ్యంగా యువతకు మెరుగైన కెరీర్ అవకాశాలు కల్పించబడతాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, లాజిస్టిక్స్ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే దిశగా ఇది కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలు, వివరాలు నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ, “రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇది మరో ముఖ్యమైన ముందడుగు. పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.