విజయవాడను కనీవినీ ఎరుగని విపత్తు ముంచేసింది. ఎంతోమంది దాతలు వరద బాధితుల సహాయార్ధం వరద సాయం ప్రకటించారు. అలాగే మాజీ సీఎం జగన్ కూడా కోటి రూపాయలు వరద బాధితుల సహాయార్ధం ఇస్తామని ప్రకటించారు. పోనీలే సొంతంగా కాకపోయినా పార్టీ తరపున అయినా సాయం అందించారని అంతా అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా.. జగన్ చేసిన ప్రకటించినట్లుగా ఆ కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆ ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.
ఏపీలో వరదల వల అతలాకుతలం అవడంతో ఎంతోమంది పెద్దలు, ప్రముఖులు, వ్యాపారస్థులు, అలాగే వివిధ రంగాలకు చెందిన వారు చివరకు చిన్నపిల్లలు తాము దాచుకున్న కిడ్డీ బ్యాంకు డబ్బులు కూడా ఇచ్చారు. ప్రతీ రోజూ సీఎం రిలీఫ్ ఫండ్ కి తాము ప్రకటించిన మొత్తాలను చెక్కు రూపంలో ఇస్తున్నారు. మరి జగన్ చెక్కు ఎపుడిస్తారనే చర్చ ఏపీ వ్యాప్తంగా సాగుతోంది.
వైసీపీ నేతలు ఎక్కవ కనిపించినా.. విడవకుండా మీడియా ముఖంగా ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు. అయితే దాని మీద సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తనదైన శైలిలో సమాధానం ఇవ్వడంతో జనాలు షాక్ అయ్యారు. జగన్ ప్రకటించిన కోటి రూపాయలు సీఈం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడానికి కాదు, తమ పార్టీ తరఫున వరద బాధితులకు సహాయ సహకారాలు చేయడానికి అని కొత్త లాజిక్ తెరమీదకు తీసుకువచ్చారు.
తమకు క్యాడర్ ఉందని.. పార్టీ ఉందని. అందువల్ల తాము ఆ మొత్తాన్ని ప్రజలకే నేరుగా వివిధ అవసరాల నిమిత్తం వెచ్చిస్తామని బొత్స చెప్పుకొచ్చారు. అంతే కాదు.. జగన్ ఇప్పటికే ఆ కోటి రూపాయలు సాయాన్ని వరద బాధితులకు అందించారని, అంతే కాదు మరో పది లక్షల రూపాయలు కూడా లేటెస్ట్ గా ఇచ్చారంటూ కొత్త లెక్కలు చెప్పారు.తాము సీఎం రిలీఫ్ ఫండ్ కి నేరుగా చెక్కు ఇవ్వమని కూడా తెగేసి చెప్పారు.
తమ క్యాడర్ తో తమ పార్టీ ద్వారానే ప్రజలకు తాము చేయాల్సిన సాయాన్ని చేస్తామని ఆదుకుంటామని చెప్పిన బొత్స.. సహాయ చర్యలను సొంతంగా నిర్వహించడానికి తగిన సిబ్బంది సైన్యం తమకూ ఉన్నారని అన్నారు. జగన్ ప్రకటించిన కోటి రూపాయల సాయంతో.. రెండు వారాలుగా వరద బాధితులకు ఆహారం, పాలు నీరు నిత్యావసరాలు ఇలా అన్నీ వైసీపీ పంపిణీ చేసిందని కూడా బొత్స కొత్త విషయాన్ని చెప్పారు. అయితే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోవాల్సిన వైసీపీ పెద్దలు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడటం ఏంటని ఏపీ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఎవరికి ఆ కోటి రూపాయల సాయాన్ని ఎవరికి అందించారంటూ కామెంట్లు చేస్తున్నారు.