తెలుగు రాష్ట్రాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కలు చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయినా సరే భూమి సెగలు కక్కుతూనే ఉంది. ఇప్పుడే ఈ రేంజ్లో ఎండలు మండిపోతుంటే..ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెల రాకముందే..రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇవి సాధారణం కన్నా 3.3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ దీనిపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. కోస్తాలోని 45 మండలాల్లో కూడా వడగాలుల తీవ్రత ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా మరో 185 మండలాల్లో కూడా వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలతోపాటు.. తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎండల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శనివారం చాలాచోట్ల 40 డిగ్రీలుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలెర్ట్ జారీ చేసింది..
ప్రధానంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ప్రకాశం జిల్లా దరిమడుగు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.7 డిగ్రీలు నమోదు కాగా.. కడప జిల్లా మద్దూరు, ఖాజీపేటలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఐతే.. రియల్ ఫీల్ మాత్రం ఇంకో 2 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.