విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగలబోతోందా? అంటే పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి విశాఖ మేయర్ పీఠంపై కన్నేసింది. ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వాస్తవానికి దివంగత నేత ఎన్టీఆర్ హయాంలో విశాఖ మేయర్ పదవి తెలుగు దేశం పార్టీకి దక్కింది. అప్పటి నుంచి ఆ పదవి టీడీపీకి అందని ద్రాక్షలానే ఉండిపోయింది. దాదాపు నలభై ఏళ్లుగా విశాఖ మేయర్ పదవి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చివరికి ఆ పదవిని వరించే అవకాశం టీడీపీకి వచ్చింది. నలభై ఏళ్ల టీడీపీ కల నెరబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పదవిని దక్కించుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ హయాంలో 1987లో విశాఖ మేయర్ పదవిని తెలుగు దేశం పార్టీ దక్కించుకుంది. ఆ తర్వాత పలుమార్లు కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పదవి దక్కింది. 2021లో విశా ఖకార్పోరేషన్‌లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండడంతో విశాఖ మేయర్ పదవి కూడా ఆ పార్టీకే దక్కింది. విశాఖ కార్పోరేషన్‌లో మొత్తం 99 మంది ఉండగా.. అందులో 58 మంది వైసీపీ కార్పోరేటర్లు ఉన్నారు. టీడీపీకి 30 మంది కార్పోరేటర్ల బలం ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో తెలుగు దేశం కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు విశాఖ మేయర్ పీఠంపై కన్నేశారు. విశాఖ మేయర్ పదవిని దక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు.
వైసీపీకి చెందిన కార్పోరేటర్లలో మూడింట రెండు వంతుల మంది కార్పోరేటర్లు తెలుగు దేశం పార్టీ వైపు చూస్తున్నారట. ఇప్పటికే వారంతా టీడీపీ పెద్దతో టచ్‌లోకి వెళ్లారట. 25 నుంచి 30 మంది వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఇదే జరిగితే విశాఖ కార్పోరేషన్‌లో టీడీపీ బలం 55 నుంచి 60 మందికి చేరే అవకాశం ఉంది. తద్వారా సులువుగా మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకునేందుకు అవకాశం ఉంది. అయితే కార్పోరేటర్లను కాపాడుకునేందుకు ఇప్పటికే మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ కార్పోరేటర్లతో టచ్‌లోకి వెళ్లారట. వైసీపీ కార్పోరేటర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారట. కానీ కార్పోరేటర్లతో అమర్నాథ్ జరిపిన చర్చలన్నీ విఫలమయినట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే విశాఖ మేయర్ పదవి టీడీపీకి దక్కనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE