గుడివాడ అమర్నాథ్.. విశాఖ జిల్లాలో వైసీపీ సీనియర్ నేత ఆయన. ఓసారి ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా అమర్నాథ్ పని చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవిని కూడా అనుభవించారు. కానీ ఆ సమయంలో మంచి పేరు కంటే ఎక్కువగా విమర్శలనే మూటకట్టుకున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసిన అమర్నాథ్.. ఓ సందర్భంలో చేసిన కామెంట్ల వల్ల గుడ్డు మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయి.. విమర్శలు కూడా ఎక్కువైపోవడంతో.. ఈసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి నుంచి అమర్నాథ్‌ను తప్పించారు. లాస్ట్ మినిట్‌లో గాజువాక టికెట్ ఇచ్చారు. కానీ అక్కడి కూడా ఆయన ఓడిపోయారు.
అయితే కొద్దిరోజులుగా గుడివాడ అమర్నాథ్‌కు సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. ఆయన వైసీపీని వీడబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అమర్నాథ్ ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోతే.. అమర్నాథ్ మాత్రం మూడోరోజే మీడియా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల పాటు తెగ హల్ చల్ చేశారు. ఇదే సమయంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని గుడివాడ అమర్నాథ్ ఫిక్స్ అయిపోయారు. 2027 వరకు పెద్దల సభలో కూర్చోవచ్చని.. విశాఖ జిల్లాలో మళ్లీ చక్రం తిప్పొచ్చని అమర్నాథ్ భావించారు.
కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. అమర్నాథ్‌ను పక్కకు పెట్టేసి.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రకటించారు. ఇప్పటికే బొత్స జనాల్లో యాక్టివ్ అయిపోయారు. విస్తృతంగ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవి దక్కితే మూడేళ్ల పాటు తిరుగుండదని భావించిన గుడివాడ అమర్నాథ్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. అయితే ఎమ్మెల్సీ పదవిని గుడివాడ అమర్నాథ్‌కు కాకుండా.. బొత్స సత్యనారాయణకు కట్ట బెట్టడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనాల్లో అమర్నాథ్‌పై వ్యతిరేకత ఉండడం ఒక కారణం అయితే.. సొంత పార్టీ నేతలు కూడా ఆయన్న వ్యతిరేకించడం మరో కారణం అట. కొందరు వైసీపీ లీడర్లే అమర్నాథ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వొద్దని హైకమాండ్ వద్ద పట్టు పట్టుకొని కూర్చున్నారట.
పై కారణాల వల్లే జగన్మోహన్ రెడ్డి.. గుడివాడ అమర్నాథ్‌ను పక్కకు పెట్టి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. దీంతో గుడివాడ అమర్నాథ్ అలకబూనారట. కొద్దిరోజులుగా వైసీపీ హైకమాండ్‌కు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారట. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొనడం లేదట. బొత్స గెలుపుకు కృషి చేయాలని.. భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని జగన్.. అమర్నాథ్‌ను బుజ్జగించినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదట. ఈక్రమంలో గుడివాడ అమర్నాథ్ వైసీపీని వీడబోతున్నారని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. త్వరలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఆ ప్రచారమే నిజమవుతుందా?.. అమర్నాథ్ వైసీపీని వీడుతారా?.. మరి వైసీపీని వీడితే ఏ పార్టీలోకి వెళ్తారు? అనేది చూడాలి.