2013 నాటి వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని తిరిగి సవరించడానికి కేంద్రం నిన్న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా.. ఈ బిల్లును విపక్ష ఇండికూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి.ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీలు దీనికి మద్దతు తెలుపగా టీడీపీ కూడా ఈ బిల్లుపై తమ మద్దతును ప్రకటించింది. కానీ వైసీపీ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించింది.
దీంతో జగన్ మోదీకి షాక్ ఇచ్చి చంద్రబాబును కూడా ఇరికించారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఏపీలోని ముస్లిం మైనారిటీలు సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి.. సెలెక్ట్ కమిటీకి పంపడానికి ముస్లిం మైనారిటీ సంఘాలు ..సీఎం చంద్రబాబుకి ఇప్పటికే వినతి పత్రాన్ని అందించాయి.
ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏపీ అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ, చంద్రబాబుకి వినతి పత్రాన్ని అందిస్తూ.. వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లిం సమాజానికి అనేక అపోహలు ఉండటం వల్ల.. సమగ్ర చర్చ జరిగే విధంగా సెలెక్ట్ కమిటీకి దీనిని పంపాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనారిటీల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. ముస్లింలకు అన్ని విధాలుగా కూటమి అండగా ఉంటుందని చెప్పారు.
కానీ పార్లమెంటులో మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్నవక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు, ఇప్పుడు ముస్లిం మైనారిటీల ఒత్తిడితో ఈ బిల్లు విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే బిల్లును వ్యతిరేకించి వైఎస్ జగన్ మాత్రం.. ముస్లిం మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి, చంద్రబాబుకు దూరం చేసే ప్లాన్ చేశారన్న వాదన వినిపిస్తోంది.
మరోవైపు ఏపీ మైనారిటీ మంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూక్ కి కూడా ముస్లిం మైనారిటీలు తమ వినతి పత్రాన్ని అందించారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని తమ వినతిపత్రంలో కోరారు.అయితే ఇప్పుడే అసలు సమస్య తెరమీదకు వస్తుంది. ముస్లిం మైనారిటీలు కోరుతున్నట్టు ఏపీ సీఎం వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించాల్సి వస్తుంది. ఇటు కేంద్రానికి అనుకూలంగా ఉంటే మాత్రం కచ్చితంగా ముస్లిం మైనారిటీలకు దూరం కావలసి వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.