పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం, వారికి రాజకీయ, సామాజిక అంశాలపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రతిష్ఠాత్మక శిక్షణా కార్యక్రమం ‘సేనతో సేనాని’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో (బుధవారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది.
అందులో.. “ఇప్పటి వరకు నమోదు చేసుకొని వారు ఇప్పుడే QR కోడ్ స్కాన్ చేసి లేదా లింక్ క్లిక్ చేసి నమోదు చేసుకోవచ్చు. మొదటి ఫేజ్‌లో నమోదు చేసుకున్న వారి నుండి కొంతమందిని ఎంపిక చేసి ఇరు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో నిర్వహించే కార్యక్రమానికి వారిని ఆహ్వానించి వారికి ఆసక్తి కలిగిన అంశాలపై చర్చించి వారికి అవకాశం జనసేన పార్టీ కల్పించనుంది.”
“ప్రత్యేకంగా యువతను రాజకీయంగా, సామాజికంగా ఎదిగే అవకాశాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం కావాలి అనే ఉద్దేశంతో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన ఈ కార్యక్రమంలో బాధ్యత కలిగిన ప్రతీ ఒక్కరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.” అని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
కీలక శిక్షణా కార్యక్రమానికి భారీ స్పందన – జనసేన శ్రేణుల్లో ఉత్సాహం:
ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. పార్టీలో క్రియాశీలకంగా మారాలనుకునే యువత ఈ కార్యక్రమం ద్వారా అధినేతతో నేరుగా మమేకమయ్యే అవకాశం లభిస్తుంది.
ముఖ్య ఉద్దేశం:
‘సేనతో సేనాని’ కార్యక్రమం ద్వారా ఎంపికైన వారికి నాయకత్వ లక్షణాలు, పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై పోరాడే తీరు వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. నేటి సాయంత్రంతో రిజిస్ట్రేషన్ గడువు ముగియనున్నందున, ఆసక్తి ఉన్నవారు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని పార్టీ వర్గాలు కోరాయి.