ఏపీలో ఆరోగ్య శ్రీ అమలులో మరో కీలక ముందడుగు పడే అవకాశముంది. ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ హెల్త్ కేర్ మోడల్ తీసుకొచ్చేలా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ స్థానంలో హైబ్రిడ్ హెల్త్‌కేర్ మోడల్‌ను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY), మరియు ఆరోగ్య బీమా కంపెనీల సేవలను ఏకీకృతం చేస్తుంది. భీమా కంపెనీలతోనూ చర్చలు చేసింది. పూర్తి స్థాయిలో చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి నివేదిక ముఖ్యమంత్రికి అందించనుంది. దీని పైన చర్చించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
బీమా సంస్థనుబట్టి దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే అవకాశముంది. ఏపీలో ఈ విధానం అమలు పైన కసరత్తు వేగవంతం చేసారు. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబం తరఫున రాష్ట్ర ప్రభుత్వం రూ.1,700 నుంచి రూ.2,000 మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా కంపెనీకి చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది. వార్షిక భీమా పరిధి రూ 2.50 లక్షల వరకు ఉంటుంది. ఆరోగ్య శ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం ఈ ఖర్చు లోపు చికిత్స పొందే వారి సంఖ్య 97శాతం వరకు ఉంది. మిగిలిన వారికి ఖర్చు రూ 2.50 లక్షలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్య శ్రీ ట్రస్లు ద్వారా చెల్లించేలా ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.
ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. వార్షిక పరిమితి కింద నిర్దేశించిన రూ.25 లక్షల వరకు చికిత్స పొందుతున్నవారు రాష్ట్రంలో లేరు. అవయవ మార్పిడి, క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.2.5లక్షలు కాకుండా ఇప్పటివరకు అధికంగా నమోదైన కేసులు రూ.5 లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. వార్షిక పరిమితి రూ.2.5 లక్షల ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్ల వరకు భరించాల్సి వస్తుంది. వివిధ రాష్ట్రాలలో హైబ్రిడ్ విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ,మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హైబ్రిడ్ విధానం అమలులో ఉండగా మహారాష్ట్రలో రూ.6 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. ఇందులో రూ.1.5వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా.. ఆపైన అవసరమైతే ట్రస్టు ద్వారా చికిత్స అందిస్తున్నారు. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయాలోనూ ఇది ఉంది. ట్రస్టు విధానాన్ని ఏపీతో పాటుగా ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, హరియాణా, బిహార్ తదితర రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి.