చంద్రబాబు సీఎం అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాలు,ప్రభుత్వాల మధ్య కొత్త వాతావరణం నెలకొంది.తాజాగా విభజన హామీల అమలుకు ఏపీ,తెలంగాణ సీఎంలు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపారు. దీనిలో భాగంగా ఈ రోజు కీలక భేటీ జరగనుంది. నిజానికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు విభజన హామీ అమలుకు నోచుకోలేదు. చాలా వాటికి ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. పదేళ్లుగా వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది.
తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. అయితే రాజకీయంగా రెండు ప్రభుత్వాల మధ్య తేడాలున్నా.. చంద్రబాబుకు రేవంత్ శిష్యుడు కావడం కలిసి వచ్చే అంశంగా మారింది. అందులో భాగంగానే కొద్దిరోజుల కిందట రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ వేదికగా సమావేశమయి .. విభజన హామీల విషయం గురించి ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపారు.
ఒకరికొకరు కీలక ప్రతిపాదనలు చేసుకొన్నారు. దీనిలో భాగంగానే.. డిసెంబర్ 2న అంటే ఈరోజు రెండో సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు హాజరు కావడం లేదు. కేవలం రెండు రాష్ట్రాల సీఎస్ ల ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ సమావేశం జరగనుంది. ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాలను వెల్లడించనుంది. దీంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళగిరిలోని ఏపీఐఐసీ ఆఫీసులో ఈ కీలక భేటీ జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమలు కావాల్సిన నిర్ణయాలపైన.. 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న పెండింగ్ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. జూలై 5న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయినప్పుడు వీలయినంత త్వరగా మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ సమావేశంలో..ఈరోజు రెండు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ అయి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.