ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ దుకాణాల్లో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏపీ వ్యాప్తంగా దుకాణాల కేటాయింపు అయితే పూర్తై రెండ్రోజులు పూర్తయ్యాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో దుకాణాలు తెరుచుకోలేదు. మద్యం దుకాణాల దక్కించుకున్న వారిలో కొంతమంది ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజుల చెల్లింపులో జాప్యంతో పాటు దుకాణాల ఏర్పాటు చేసే స్థలాల లభ్యత , ఇతర సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో ఇంకా దుకాణాలు ఏర్పాటు కాలేదు.
ఏపీ వ్యాప్తంగా 3వేల396 మద్యం దుకాణాలను లాటరీలో రెండు రోజుల క్రితం కేటాయించిన విషయం తెలిసిందే. ఏపీలో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం 99 రూపాయల మద్యాన్ని ప్రైవేట్ దుకాణాల్లో విక్రయించడానికి సిద్ధమవుతోంది. వచ్చే సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం ఏపీకి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
అక్టోబర్ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం విక్రయాలకు తాము సిద్ధం చేస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం నుంచి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. లిక్కర్ అమ్మకాలలో జాతీయ స్దాయిలో గుర్తింపు పొందిన 5 మద్యం తయారీ కంపెనీలు ఏపీలో ఈ ధరకు మద్యాన్ని విక్రయంచడానికి సిద్దం అయ్యాయని వివరించారు. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కేసుల 99 రూపాయలు ఖరీదు చేసే మద్యం మార్కెట్ కు చేరిందని.. సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు.
దశల వారిగా సరఫరా ఈ సరఫరా పెరిగి అక్టోబర్ నెలాఖరు నాటికి 2లక్షల40వేల కేసుల మద్యం ఏపీలో అందుబాటులో ఉంచుతామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల లిక్కర్ ఈ నెలలో అందుబాటులోకి వస్తున్నట్లు వివరించారు. మద్యం వినియోగాన్ని బట్టి.. రానున్న నెలలలో బ్రాండ్ల వారీగా ఎంత మేరకు దిగుమతి చేసుకోవాలని అనే దానిపై క్లారిటీ వచ్చాక తాము నిర్ణయం తీసుకుంటామని అన్నారు.