తండ్రి బాటలోనే చినబాబు..విజన్ మార్చుకున్న లోకేష్..

నారా లోకేష్..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇంగ్లిష్‌ మీడియం చదువులు, రాజకీయ అనుభవం లేకపోవడంతో మొన్నటి వరకు ఇబ్బంది పడ్డ లోకేష్..ఇప్పుడు బాగా రాటుదేలి మెచ్యూర్డ్‌ రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా సీఎం చంద్రబాబు తన విజనరీతో భవిష్యత్‌ను అంచనా వేసి పనులు చేయగల నేర్పరిగా ముద్ర పడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఒక ఎత్తయితే..యువతతో పోటీ పడేలా ఉండే ఆయన ఆలోచన విధానం మరో ఎత్తు. అయితే నారావారి వారసుడిగా వచ్చిన లోకేష్‌ తండ్రి చంద్రబాబు వ్యూహాలను అందుకోగలరా అన్న డౌట్లు చాలా మందిలో ఉన్నాయి.

కానీ అదంతా గతమని లోకేష్‌ను దగ్గరి నుంచి గమనిస్తున్నవారు అంటున్నారు. నిజమే లోకేష్ రోజురోజుకు పాలిటిక్స్‌లో బాగా రాటు దేలుతున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్లు విపక్షంలో ఉన్పప్పుడు లోకేష్‌ తనలోని లీడర్ షిప్ క్వాలిటీస్ కు పదును పెట్టారు. అంతేకాదు యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర బాగా ప్లస్ అయింది. తనతో పాటు తన పార్టీకి కూడా అది మంచి మైలేజీ తెచ్చింది. కొద్ది కాలంగా టీడీపీ వ్యవహారాలను మొత్తం తానే చూసుకుంటున్న లోకేష్.. అదే సమయంలో మిత్రపక్షం జనసేనతో బంధాన్ని కూడా మరింత బలోపతం చేసుకుంటున్నారు. జన సేనాని పవన్‌ కళ్యాణ్‌ను పవనన్నా అని పిలుస్తూ ..ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా పవన్‌ను కలుపుకొనిపోతున్నారు.

ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్‌కు మరోసారి నోరెత్తకుండా సీరియస్ వార్నింగ్ ఇస్తూనే తన స్థాయిని గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు. పవన్‌ సత్తా ఏమిటో పవన్‌కు ఉన్న పవర్ ఏమిటో లోకేష్ వివరించిన తీరుకు ఇటు జనసైనికులు పూర్తిగా ఫిదా అయిపోయారు. అలాగే ఇటీవల కొణిదెల నాగబాబుకు మద్దతుగా.. ఇక జనసేన తరఫున ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేయడానికి వచ్చినపుడు ఆయన తరఫున లోకేష్ కూడా వచ్చారు. నాగబాబు నామినేషన్‌ దాఖలు చేసినంతసేపు వెంటే ఉన్నారు. ఇవన్నీ లోకేష్‌ పొలిటికల్‌ మెచ్యూరిటీకి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .

సీఎం చంద్రబాబు ప్రతీ విషయాన్ని ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ విమర్శల ప్రసంశలు కూడా అందుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచీ కూడా అటు పవన్, ఇటు సీఎం చంద్రబాబు మిత్ర ధర్మం పాటిస్తున్నారు. మిత్రులను పల్లెతు మాట కూడా పడనివ్వడం లేదు సరికదా.. వారికి దెబ్బ తగిలితే తమకే దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే ఫాలో అవడం జగన్ వర్గీయులకు అస్సలు మింగుడు పడడం లేదు.