పల్నాడు జిల్లా వినుకొండలో అత్యంత క్రూరమైన ఘటన చోటుచేసుకుంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు అత్యంత ఘోరంగా నరికి చంపారు. వినుకొండలో అర్థరాత్రి షేక్ అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే వ్యక్తి నరికి హత్య చేశాడు. ఆయన చెయ్యి తెగి రోడ్డుపై పడిపోయినప్పటికీ ఆగకుండా.. ఆయనపై కత్తిలో విరుచుకుపడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా రషీద్‌ను నరికాడు. ఈ ఘటనలో రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ ఘనపై స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తే.. దానికి కౌంటర్‌గా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
వినుకొండలో జరిగిన ఘటనపై జగన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని.. లా లండ్ ఆర్డర్ అనేది కనిపించకుండా పోయిందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, విధ్వంవసాలకు కేరాఫ్‌గా మారిందని మండిపడ్డారు. వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని పేర్కొన్నారు. నడిరోడ్డుపై దారుణ హత్య జరగడం ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలన్న కోణంలోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని.. రాజకీయ దురుద్దేశాలతో ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు ఇటువంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ భగ్గుమన్నారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వింతగా ఉందని అన్నారు. రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటిందని.. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోందని లోకేష్ వెల్లడించారు. జగన్ అసత్య ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నేరాలు చేసి వాటిని వేరే వారిపైకి నెట్టే మీ కపట నాటకాలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను ఉపేక్షించేది లేదని.. నిందితులను విదిలిపెట్టకుండా కఠినంగా శిక్షిస్తామని నారా లోకేష్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF