తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగకు సిద్ధపడుతోంది. ఎందుకంటే టీడీపీకి మహానాడు ఒక పండుగ లాంటిది. ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే మహానాడును ఈసారి రాయలసీమలో నిర్వహించాలని పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు మహానాడును ఈసారి కడప జిల్లాలో నిర్వహించేందుకు డిసైడ్ అయిన సీఎం.. మహానాడు కార్యక్రమం అనంతరం కేంద్ర, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది మహానాడు మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు.
ఏపీ విభజన తర్వాత రాయలసీమలో ఇప్పటి వరకూ మహానాడు జరగలేదు. దీంతోనే మూడు రోజులపాటు అక్కడ మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. కడప జిల్లా అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే కడప జిల్లా అన్నట్టు ఒకప్పుడు పరిస్థితి ఉండేది. కానీ వైఎస్సార్ చనిపోయాక అక్కడ సీన్ మారిపోయింది. మెల్లమెల్లగా కడప జిల్లాలో టీడీపీ కూటమి పట్టు బిగించింది. పది అసెంబ్లీ సీట్లకు గాను ఏడింట విజయం సాధించి వైసీపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చింది. అందుకే ఇదే పట్టు అక్కడ కంటెన్యూ అవ్వాలంటే పార్టీ కార్యక్రమాలు పెరగాలని అనుకుంటున్న సీఎం..కడపలో మహానాడు నిర్వహించడానికి డిసైడయ్యారు.
మహానాడు వేదికగా కూటమితో కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి 60 కుటుంబాలకు టీడీపీ తరఫున ఒక సాధికార సారధిని నియమించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా అడుగులు పడలేదు. దీనికోసం ఫిబ్రవరి 6న కుటుంబ సాధికార సారథులు, యూత్, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిల నియామక ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కడపలో నిర్వహించబోయే మహానాడు సమయానికి ..బూత్, క్లస్టర్, యూనిట్, గ్రామ, మండల కమిటీలు, మున్సిపాలిటీలో వార్డు కమిటీలతో పాటు.. శాసనసభ, లోక్ సభ నియోజకవర్గ కమిటీలు, అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు.
కిందిస్థాయి కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుడు వరకు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండాల్సిందే అన్న నిబంధనను పెట్టనున్నారు. వీటిలో ఉన్న వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నారు. పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీ, ఎమ్మెల్యేలతో తరచూ సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. ప్రతి శనివారం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ క్రమం తప్పకుండా జరగాలని పార్టీ హై కమాండ్ గట్టిగానే నిర్ణయం తీసుకుంది.