ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఐటీ రంగం కీలకమని, కేంద్రం సహాయంతో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మౌలిక వసతుల కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ప్యాకేజీపై చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు త్వరగా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
20 లక్షల ఉద్యోగాల హామీపై
ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని లోకేశ్ తెలిపారు. ఐటీ, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో మరిన్ని అవకాశాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళనకరం!
గతంలో 45 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా, ప్రస్తుతం అది 32 లక్షలకు తగ్గిందని లోకేశ్ వివరించారు. విద్యారంగ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర సహాయం అవసరమని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ మంజూరు – కేంద్రానికి కృతజ్ఞతలు
రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు.