మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని.. భార్య మౌనికతో కలిసి రాజకీయంగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. అది ఎప్పుడో కాదని ఈరోజు తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటన చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకోవడం..తండ్రితో మనోజ్ విభేదించడం. మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి. ఆసుపత్రిలో చేరిక.. ఇలా కొద్ది రోజులు పాటు మంచి ఫ్యామిలీ ఎపిసోడ్ నడిచింది.
మోహన్ బాబు బహిరంగ క్షమాపణ తర్వాత ఈ వివాదం సద్దు మణిగింది. ఇలాంటి సమయలోనే మంచు మనోజ్, మౌనిక దంపతులు తమ పొలిటికల్ ఎంట్రీ పై కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన పరిణామాలతో తాను రాజకీయంగా బలపడితేనే తన భవిష్యత్తు ఉంటుందని మంచు మనోజ్ భావించారట.
ఇక ఇటు మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభా నాగిరెడ్డి అకాల మరణంతో పెద్ద కుమార్తె అఖిలప్రియ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా. అక్కకు చేదోడు వాదోడుగా మౌనిక ఉండేవారు. మౌనిక కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందన్న ప్రచారం జరిగినా.. ఆమె వివాహంతో ఆ న్యూస్ కు ఫుల్ స్టాప్ పడింది.
అటు మోహన్ బాబు కూడా టీడీపీలో ఓ వెలుగు వెలిగినవారే. రాజ్యసభ సభ్యుడిగా కూడా పదవి చేపట్టారు. అలాగే ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉండేవి. తరువాత చంద్రబాబు నాయకత్వంలో కొద్దిరోజుల పాటు పనిచేసిన మోహన్ బాబు.. ఆయనతో విభేదించి టీడీపీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి దగ్గరయి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడంతో.. వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీసం ప్రచారం కూడా చేయలేదు.
కాగా ఈ ఎన్నికల్లోనే మనోజ్ పోటీ చేస్తారనే ప్రచారం నడిచింది. ఆయనకు పవన్ కళ్యాణ్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతోనే తాజాగా జరిగిన పరిణామాలతో జనసేనలో చేరడానికి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాదు నుంచి ప్రత్యేక కార్ల ర్యాలీగా మనోజ్ దంపతులు ఆళ్లగడ్డ చేరుకోనున్నారని.. సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరి సమక్షంలో మనోజ్ దంపతులు తమ రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తారని ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది.