ఏపీకి భారీ పెట్టుబడి రాబోతోంది. బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) రామాయపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు మొత్తం రూ.95,000 కోట్ల పెట్టుబడితో దశల వారీగా అమలు కానుంది. ప్రస్తుతం రూ.6,100 కోట్ల అంచనా వ్యయంతో ముందస్తు కార్యకలాపాలకు ఆమోదం లభించింది.
ప్రాజెక్టు ఎంపికలో గుజరాత్‌తో పోటీ:
ముందుగా మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం వంటి ప్రాంతాలను పరిశీలించిన బీపీసీఎల్, అవసరమైన భూభాగం, తూర్పు తీరంలో రామాయపట్నం అనువైన ప్రాంతమని నిర్ధారించింది. దీనిపై గుజరాత్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా ఏపీ ప్రాజెక్టును దక్కించుకుంది.
భూమి అవసరం: సుమారు 5,000 ఎకరాలు
మొత్తం ఖర్చు: రూ.6,100 కోట్లలో రూ.1,500 కోట్లు భూసేకరణకు, మిగిలినది ఇతర అవసరాల కోసం
ఉపాధి అవకాశాలు: నిర్మాణ సమయంలో 1 లక్ష మందికి, పూర్తయిన తర్వాత 5,000 మందికి శాశ్వత ఉపాధి
ప్రారంభ కార్యకలాపాలు:
బీపీసీఎల్ తన లేఖలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు రామాయపట్నం ప్రాజెక్టు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. భూసేకరణ, పర్యావరణ ప్రభావం, డిజైన్ ఇంజినీరింగ్ వంటి ముందస్తు పనులు చేపట్టనున్నట్లు పేర్కొంది. రామాయపట్నం పోర్టులో రిఫైనరీ కోసం ప్రత్యేక బెర్త్ కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.