అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్ తాజాగా ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఏపీలో ఉన్న అవకాశాలపై సత్య నాదెళ్లకు లోకేష్ వివరించారు. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ కు టెక్నికల్ సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర రాజధానికి ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు రావాలని సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు. అంతే కాదు ఏపీతో సత్య నాదెళ్ల కుటుంబానికి అనుబంధాన్ని కూడా లోకేశ్ గుర్తు చేశారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషిచేసినట్లు వెల్లడించారు.
ఏపీని సాంకేతిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తాము ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నామని.. ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని కోరారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా ఉందన్నారు సత్య నాదెళ్ల. అలాంటి సెంటర్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌కు మైక్రోసాఫ్ట్ మార్కెట్ 3.1 ట్రిలియన్ డాలర్లగా ఉందని చెప్పారు.. 2023లో మైక్రోసాఫ్ట్ 211.9 బిలియన్ డాలర్ల ఆదాయం ఉందన్నారు.
అంతకు ముందు నారా లోకేష్ టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనంతపురం అనుకూలంగా ఉంటుందని వివరించారు.అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని పేర్కొన్నారు. ఆ తర్వాత డల్లాస్‌లో పెరోట్ గ్రూప్ ఛైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌ను లోకేష్ కలిశారు. మరికొంత మంది కంపెనీల సీఈఓలను లోకేష్ కలిసే అవకాశం ఉంది.