భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh Unveils Statue of Bhakta Kanakadasa in Kalyandurgam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం (నవంబర్ 7, 2025) నాడు కళ్యాణదుర్గం లో భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాసును ఆరాధించే కురుబ (కురుమ) సామాజిక వర్గానికి చెందిన భక్తులు, అనుచరులు ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆ ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా కురుబ వర్గ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. “భక్త కనకదాస జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారు. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతిలో పాల్గొనడం, భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “భక్త కనకదాసు వంటి మహనీయుల ఆశయాలను, బోధనలను నేటి తరానికి అందించడం చాలా ముఖ్యం. కురుబ సామాజికవర్గ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కురుబ సామాజిక వర్గానికి మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు, వారి అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తాం. మా మామ బాలకృష్ణను 3సార్లు గెలిపించిన నేల అనంతపురం. ఈ నేలకు జీవితాంతం మేం రుణపడి ఉంటాం” అని మంత్రి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here