ఏపీలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉందని బాగా రెచ్చిపోయిన నేతలపై పోలీసులు కేసు నమోదు చేస్తూ .. అరెస్టులు చేస్తున్నారు.ఇదే సమయంలో మాజీ మంత్రి విడదల రజిని ..మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. దీంతో తనపై కక్ష కట్టిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలే ఇదంతా చేస్తున్నారంటూ విడదల రజినీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు. కాగా దీనిపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కూడా స్పందించడంతో మాజీ మంత్రి వర్సెస్ ఎంపీ అన్నట్టుగా ఏపీ రాజకీయాలలో పరిస్థితి మారింది.
2019లో విడదల రజిని చిలకలూరిపేట నుంచి గెలిచారు . మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి.. రజినీని మంత్రివర్గంలోకి తీసుకొని కీలక శాఖను అప్పగించారు. అప్పట్లో నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉండేవారు. అప్పట్లో పల్నాడు జిల్లాలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారని విడదల రజినిపై కేసు నమోదయింది. రజినీతో పాటు ఓ ఐపీఎస్ అధికారి, ఆమె మరిది, ఈయనపై కూడా కేసులు నమోదయ్యాయి. కానీ అప్పుడు వైసీపీ గవర్నమెంటు ఉండటంతో అది అక్కడే ఆగిపోయింది.
కానీ ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగడంతో.. మీడియా ముందుకు వచ్చారు మాజీ మంత్రి విడదల రజిని. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలపై ఫోన్ ట్యాపింగ్ విమర్శలు కూడా చేయడంతో..అవి సంచలనంగా మారాయి. అయితే దీనిపై ఘాటుగా మాట్లాడిన శ్రీకృష్ణదేవరాయలు.. ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు ఇతర అధికారుల వాంగ్మూలాలు ఉన్నట్లు రజినీకి గుర్తు చేశారు ఎంపీ. తాను కాల్ డేటా తీసుకున్నానని చేసిన ఆరోపణలపై .. తమ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని.. తమవారికి ఒక న్యాయం.. బయట వారికి మరో న్యాయం ఉండదని తేల్చి చెప్పారు.
మరోవైపు విజ్ఞాన్ విద్యాసంస్థలకు భూ కేటాయింపులపైన కూడా విడదల రజిని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో..దీనిపైన కూడా స్పందించారు ఎంపీ. 40 సంవత్సరాలుగా విజ్ఞాన్ విద్యాసంస్థల నడుపుతున్నామని.. కానీ ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని ఇప్పటి వరకూ అడగలేదన్నారు. అమరావతిలో భూమి కోసం అనేక విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకున్నా .. తాము మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదన్నారు.
2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని.. ఎక్కువ రేటు చెల్లించి మరీ భూమి తీసుకున్న విషయం రజినీకి గుర్తు లేదా అని ప్రశ్నించారు. వేలానికి, కేటాయింపునకు మధ్య చాలా తేడా ఉందని.. దానిని గుర్తించుకోవాలని ఘాటుగా చెప్పారు. అంతేకాదు తాను స్టోన్ క్రషర్ కేసు నుంచి బయట పడటానికి 10 రోజుల క్రితం రాయభారం పంపిందెవరిని ప్రశ్నించారు. దీంతో ఏపీ రాజకీయాలు మరీ ముఖ్యంగా పల్నాడు రాజకీయాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.