తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి వేడుకలలో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ శుక్రవారం విజయవాడ చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేటి ఉదయం చెన్నై నుంచి విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రజినీకాంత్‌కు ఎన్టీఆర్ కుమారుడు, టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు టీడీపీకి చెందిన సీనియర్ నేత టీడీ జనార్దన్ మరియు శత జయంతి వేడుకల సావనీర్ కమిటీ రజినీకాంత్‌ను రిసీవ్ చేసుకునేందుకు గన్నవరం విచ్చేసారు. ఇక బాలకృష్ణను చూడగానే రజినీకాంత్ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఎలా ఉన్నారంటూ ఒకరికొకరు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం ఒకే కారులో ఇరువురు నోవోటెల్‌కు బయలుదేరి వెళ్లారు.
కాగా ఈరోజు సాయంత్రం నగరంలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభ జరుగనుంది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ సహా పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై రెండు పుస్తకాల విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను రజినీకాంత్ మరియు చంద్రబాబు విడుదల చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్‌పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్. వెంకటనారాయణ సభలో పాల్గొననున్నారు. ఇక దీనికిముందు ఉండవల్లిలోని తన నివాసంలో రజినీకాంత్‌కు చంద్రబాబు తేనేటి విందు ఇవ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE